Hyderabad: పదిహేనేళ్ల ప్రేమ తరువాత, రాకేష్ ను పెళ్లాడిన షకీరా... కవలలకు జన్మనిచ్చి తనువు చాలింపు!

  • హైదరాబాద్, బండ్లగూడ సమీపంలో ఘటన
  • మతాలు వేరు కావడంతో తొలుత పెళ్లికి అంగీకరించని పెద్దలు
  • వారి పట్టుదల చూసి చివరకు అంగీకారం
  • పెళ్లయిన ఏడాదిలోనే అనారోగ్యంతో మరణం

వారిద్దరి ప్రేమ వయసు 15 సంవత్సరాలు. మతాలు వేరుకావడంతో రెండు కుటుంబాలనూ ఒప్పించేందుకు దశాబ్దానికి పైగా సమయం పట్టింది. ఒకరిని విడిచి ఒకరు ఉండలేరని భావించిన రెండు కుటుంబాలూ గత సంవత్సరం పెళ్లి చేసేందుకు అంగీకరించగా, విధి వారిని ఏడాది వ్యవధిలోనే వేరు చేసింది. గత సంవత్సరం తన ప్రియుడు రాకేష్ ను వివాహమాడిన షకీరా బేగం, కవలలకు జన్మనిచ్చి కన్నుమూయడం, హైదరాబాద్, నాగోల్ ప్రాంతంలో విషాదాన్ని నిపింది.

మరిన్ని వివరాల్లోకి వెళితే, ఇక్కడి బండ్లగూడకు చెందిన పంగులూరి రాకేష్‌ తన ఇంటి ముందే నివాసం ఉంటున్న షకీరా బేగంను కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి ప్రేమించాడు. అయితే, మతాలు వేరు కావడంతో రెండు కుటుంబాలూ పెళ్లికి అంగీకరించలేదు. షకీరా కుటుంబం ఉప్పల్ కు నివాసం మార్చినా, వీరి ప్రేమ కొనసాగింది. ఎట్టకేలకు వారి పట్టుదలను గుర్తించి, ప్రేమను అంగీకరించిన పెద్దలు పెళ్లికి ఒప్పుకోవడంతో 2017 డిసెంబర్‌ 3న వీరి వివాహం వైభవంగా జరిగింది. వీరి దాంపత్యానికి చిహ్నంగా షకీరా గర్భం దాల్చగా, ఆమెను చూసుకోవడం కోసం రాకేష్, తన ఉద్యోగానికి కూడా రాజీనామా చేసి ఇంటిపట్టునే ఉన్నాడు.

వైద్య పరీక్షల్లో ఆమెకు కవలలు పుట్టనున్నారని డాక్టర్లు చెప్పడంతో సంబరపడిపోయాడు. ఎనిమిదో నెల నడుస్తుండగా, శుక్రవారం నాడు ఆమె అనారోగ్యానికి గురైంది. ఎల్బీ నగర్‌ లోని ఓ ఆసుపత్రికి ఆమెను తరలించగా, అత్యవసర సిజేరియన్ చేసిన వైద్యులు, ఇద్దరు ఆడపిల్లలను బయటకు తీశారు. ఆపై ఆమె ఆరోగ్యం మరింతగా విషమించి మరణించింది. బంధుమిత్రులు, సన్నిహితుల కన్నీటి వీడ్కోలు మధ్య ఆమె అంత్యక్రియలను నిర్వహించారు.

More Telugu News