BJP: 'బీజేపీతో ఎందుకు పెట్టుకుంటున్నారు?' అంటూ ఐటీ అధికారులు తనను ప్రశ్నించారన్న సీఎం రమేష్!

  • బీజేపీపై పోరాడుతున్నందునే ఐటీ దాడులు
  • సోదాలకు వచ్చిన అధికారులు చెప్పారన్న సీఎం రమేష్
  • బెదిరింపులకు భయపడబోనని వెల్లడి

తాను బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతూ, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు, విభజన హామీల అమలు దిశగా ఒత్తిడి తెస్తున్నందునే తనపై ఐటీ అధికారులతో దాడులు చేయించారని తెలుగుదేశం ఎంపీ సీఎం రమేష్ వ్యాఖ్యానించారు. ఐటీ అధికారులు పంచనామా కాపీని తనకు అందించి, సోదాలు ముగిసినట్టు తెలిపి, వెళ్లిపోయిన తరువాత ఆయన గత అర్ధరాత్రి మీడియాతో మాట్లాడారు.

"నేను కరుడుగట్టిన టీడీపీవాదినని అందరికీ తెలుసు. నన్ను బీజేపీలోకి రావాలని అడిగారు. సోదాలు చేసేందుకు వచ్చిన అధికారులు కూడా, బీజేపీతో ఎందుకు పెట్టుకున్నారని నన్ను ప్రశ్నించారు. నాపై నెల రోజుల క్రితం జీఎస్టీ అధికారులు దాడులు చేశారు. ఆ విషయాన్ని నేను ఎవరికీ చెప్పలేదు. భయానికి గురిచేసేందుకే నాపై బీజేపీ దాడులు చేయిస్తోంది. నేను ఎలాంటి బెదిరింపులకూ భయపడను. రేపు మరోసారి మీడియా ముందుకు వచ్చి మరిన్ని వివరాలు తెలియజేస్తాను" అని ఆయన అన్నారు.

More Telugu News