KTR: ఒక ఇందిరాగాంధీ, ఒక ఎన్టీఆర్... ఇప్పుడు కేసీఆర్ మాత్రమే!: కేటీఆర్

  • నమ్మితే ప్రాణాలు ఇవ్వడం తెలంగాణ ప్రజల నైజం
  • అమెరికాలోలా ఎన్నికలు జరిగితే 80 శాతం ఓట్లు కేసీఆర్ కే
  • బద్ధ శత్రువులైన టీడీపీ, కాంగ్రెస్ పొత్తు ఫలించదు

ఎవరినైనా నమ్మితే, వారికి ప్రాణాలు ఇవ్వడం తెలంగాణ ప్రజల స్వభావమని, ఒకప్పుడు పేదలు ఇందిరాగాంధీని నమ్మారని, ఆ తరువాత ఎన్టీఆర్ ను నమ్మారని, ఇప్పుడు కేసీఆర్ ను మాత్రమే నమ్ముతున్నారని టీఆర్ఎస్ యువనేత కేటీఆర్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న వేళ, రూ. 200 పింఛన్ ఇచ్చారని గుర్తుచేసిన ఆయన, తాము వచ్చి దాన్ని ఐదు రెట్లు పెంచామని, ఇప్పుడు కాంగ్రెసోళ్లు వచ్చి రూ. 2 వేలు ఇస్తామంటే ఎవరూ నమ్మడం లేదని అన్నారు. ఎమ్మెల్యేలపై 100 శాతం సంతృప్తి అసాధ్యమని, ప్రతి ఒక్కరిపైనా ఎంతో కొంత అసంతృప్తి ఉంటుందని అభిప్రాయపడ్డ కేటీఆర్, సంక్షేమ పథకాలను అందిస్తున్నప్పటికీ, వ్యక్తిగత పనులు చేయలేదని తప్పుబట్టే వారు ప్రతి చోటా ఉంటారని చెప్పారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు జరిగేట్టుగా తెలంగాణలో ఎన్నికలు జరిగితే, కేసీఆర్ కు 80 శాతానికి పైగా ఓట్లు వస్తాయని అన్నారు. 1982 నుంచి బద్ధ శత్రువులుగా ఉన్న టీడీపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య పొత్తు జరిగే పని కాదని, క్షేత్రస్థాయిలో ఆ పార్టీ నేతలు కలసి పనిచేసే అవకాశాలు లేవని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. 2009లో టీడీపీతో పొత్తును సైతం కేసీఆర్ వద్దంటే, తామే ఒత్తిడి చేసి ఒప్పించామని, కానీ, అది ఫలించలేదని గుర్తు చేశారు. ఒకరిపై ఒకరికి విశ్వాసం లేక, ఓట్ల బదిలీ జరగలేదని అన్నారు. కేవలం కేసీఆర్ ను గద్దె దించాలన్న కుట్రతోనే కాంగ్రెస్ టీడీపీలు కలిశాయే తప్ప, మరే సిద్ధాంతమూ కాదని అన్నారు. సీట్లు తేలక కాంగ్రెస్, టీడీపీవాళ్లు అంగీ, లాగు చింపుకోకతప్పదని ఎద్దేవా చేశారు.

More Telugu News