me too: ‘మీ టూ’.. ఈసారి బీసీసీఐ సీఈఓ రాహుల్ జోహ్రీపై లైంగిక వేధింపుల ఆరోపణలు!

  • రాహుల్ జోహ్రీ నా మాజీ సహోద్యోగి 
  • నా పట్ల చాలా అసభ్యంగా ప్రవర్తించేవారు
  • ఓ పాత్రికేయురాలి ఆరోపణ

లైంగిక వేధింపులకు గురైన బాధితురాళ్లు ‘మీ టూ’ వేదికగా ఒక్కొక్కరే తమ గళం విప్పుతున్నారు. ‘మీటూ’లో ఈసారి బీసీసీఐ వంతు వచ్చింది. బీసీసీఐ సీఈఓ రాహుల్ జోహ్రీ తనను వేధింపులకు గురిచేశారంటూ ఓ పాత్రికేయురాలు ఆరోపించారు. ఈ ఆరోపణలకు సంబంధించిన మెయిల్స్ ను ఓ నెటిజన్ షేర్ చేశాడు. రాహుల్ జోహ్రీకి సమయం వచ్చిందని సదరు నెటిజన్ తన పోస్ట్ లో పేర్కొన్నారు.

  బాధితురాలు పొందుపరిచిన మెయిల్స్ ప్రకారం.. రాహుల్ జోహ్రీ ప్రస్తుతం బీసీసీఐ సీఈఓ గా ఉన్నారని, రాహుల్ తన మాజీ సహోద్యోగి అని, విధుల్లో భాగంగా తాము బయటకు వెళ్లాల్సి వచ్చేదని ఆమె పేర్కొంది. అలా, బయటకు వెళ్లిన సందర్భాల్లో తనను తాకేందుకు ఆయన యత్నించేవారని ఆరోపించారు. ‘కాఫీకి వెళ్దామా?’ అంటూ ఆయన ఫోన్లు చేసేవారని చెప్పారు.

గతంలో ఓ కొత్త న్యూస్ ఛానెల్ ప్రారంభోత్సవానికి తనను కూడా రమ్మని ఆయన పిలిచారని, అందుకు, తాను నిరాకరించానని, ఆ మర్నాడే, ఉద్యోగ రీత్యా తాను ఇబ్బందుల్లో పడ్డానని గుర్తుచేసుకున్నారు. తన పట్ల చాలా అసభ్యంగా ప్రవర్తించేవారని, ఓసారి, ఆయన ప్రవర్తన చూసి విస్తుపోయి...ఆయనపై గ్లాస్ విసిరేశానని నాటి సంఘటనను ప్రస్తావించారు. అయినప్పటికీ, రాహుల్ జోహ్రీ ప్రవర్తనలో ఎటువంటి మార్పు రాలేదని తన మెయిల్స్ లో బాధితురాలు ఆరోపించారు.

కాగా, మీడియా రంగంలో ఇరవై సంవత్సరాలకు పైగా జోహ్రీ పని చేశారు. ఆజ్ తక్, అవుట్ లుక్, హిందుస్థాన్ టైమ్స్, పలు న్యూస్ ఛానెళ్లు, మేగజైన్స్ లో పని చేసిన అనుభవం ఆయనకు ఉంది.

More Telugu News