New Delhi: ఢిల్లీలో దోపిడీ దొంగల బీభత్సం.. క్యాషియర్ పై కాల్పులు.. లూటీ!

  • ద్వారక ప్రాంతంలోని కార్పొరేషన్ బ్యాంకు లో ఘటన
  • పట్టపగలు బ్యాంకులోకి చొరబడ్డ దొంగలు
  • సీసీటీవీల ఆధారంగా గాలిస్తున్న పోలీసులు

కట్టుదిట్టమైన భద్రత, చీమ చిటుక్కుమన్నా వాలిపోయే పోలీసులు, అడుగడుగునా సీసీటీవీ కెమెరాలు ఉండే ఢిల్లీలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. పట్టపగలు బ్యాంకుపై దాడిచేసి తుపాకులతో విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఓ ఉద్యోగిపై కిరాతకంగా కాల్పులు జరిపి, నగదుతో పరారయ్యారు. దేశ రాజధానిలోని ద్వారక ప్రాంతంలో నిన్న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ద్వారక ప్రాంతంలోని కార్పొరేషన్‌ బ్యాంకు శాఖలో నిన్న మధ్యాహ్నం ముసుగు ధరించిన కొందరు సాయుధ దుండగులు చొరబడ్డారు. తొలుత తలుపులను మూసివేసి నగదును ఇవ్వాలని బ్యాంకు క్యాషియర్ తో పాటు కస్టమర్లను బెదిరించారు. వారి నుంచి నగదును దోచుకున్నాక క్యాషియర్ సంతోష్ కుమార్ పై కాల్పులు జరిపారు. చివరికి రూ.2 లక్షలు తీసుకుని అక్కడి నుంచి ఉడాయించారు.

దీంతో పోలీసులకు సమాచారం అందించిన కస్టమర్లు, బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. అయితే రక్తస్రావం ఎక్కువగా కావడంతో సంతోష్ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. దోపిడీ దొంగలు జరిపిన కాల్పుల్లో మరో ముగ్గురు గాయపడగా, స్వల్ప చికిత్స అనంతరం వారు డిశ్చార్జ్ అయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు.. సీసీటీవీలో రికార్డయిన ఫీడ్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు.

More Telugu News