Telangana: ‘మెట్రో ట్రబుల్’.. సమస్యను పరిష్కరించిన అధికారులు.. నడుస్తున్న మెట్రో రైళ్లు!

  • మీడియాతో మాట్లాడిన సంస్థ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి
  • సాంకేతిక సమస్యతో రైలు ఆగిపోయిందని వెల్లడి
  • అసౌకర్యానికి ప్రయాణికులకు క్షమాపణలు

ఈ రోజు ఉదయం అమీర్ పేట-మియాపూర్ మార్గంలో మెట్రో రైలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. సాంకేతిక సమస్యకు తోడు విద్యుత్ సరఫరా ఆగిపోవడంతో రైలు సర్వీసు ఆగిపోయినట్లు మెట్రో సిబ్బంది కూడా చెప్పారు. దాదాపు 3 గంటల పాటు వేచి ఉండేలా చేయడంతో పలువురు ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఈ విషయమై స్పందించారు. సాంకేతిక సమస్యలతో నిలిచిపోయిన మెట్రో రైలు సర్వీసులను పునరుద్ధరించామని తెలిపారు.

బాలానగర్‌ మెట్రో స్టేషన్‌ వద్ద రైలు ఆగిపోవడంతో, మియాపూర్‌ నుంచి అమీర్‌పేట వైపు వచ్చే రైళ్ల రాకపోకలు స్తంభించాయని వెల్లడించారు. సమాచారం తెలుసుకున్న తమ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని మరమ్మతులు చేపట్టారని పేర్కొన్నారు. సమస్య ఎక్కడ తలెత్తిందో గుర్తించేందుకు కొంచెం ఎక్కువ సమయం పట్టిందని వివరణ ఇచ్చారు. ప్రస్తుతం ఈ మార్గంలో రాకపోకలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా ఇబ్బందిపడ్డ మెట్రో ప్రయాణికులకు ఆయన క్షమాపణలు చెప్పారు.

More Telugu News