Haryana: టెన్త్‌ ఆన్సర్‌ షీట్‌పై ఓ బాలిక హృదయావేదన ఆవిష్కరణ!

  • మామయ్య, పిన్నికొడుకు లైంగిక వేధింపులను రాసిన బాధితురాలు
  • వివరాలు చూసి అవాక్కయిన పేపరు దిద్దిన టీచర్‌
  • హర్యానా జిల్లా గురుగావ్‌ జిల్లా బాద్‌షాపూర్‌లో ఘటన

అటు మామయ్య...ఇటు పిన్నికొడుకు...వావి వరసలు మర్చిపోయి తనవైపు చూస్తున్న వక్రచూపులు, వెకిలి చేష్టలు ఆమెను చికాకుకు గురిచేస్తున్నాయి. వారి లైంగిక వేధింపుల నుంచి ఎలా తప్పించుకోవాలో, ఏం చేయాలో అర్థంకాక మానసిక వేదనతో కుంగిపోతున్న ఆ బాలికకు యూనిట్‌ టెస్ట్‌ ఓ అవకాశంగా కనిపించింది.

పరీక్ష హాల్లో కూర్చున్న బాలికకు అన్నీ తెలిసిన ప్రశ్నలే వచ్చినా, జవాబులకు బదులు తన గుండెలోతుల్లోని ఆవేదనకు అక్షర రూపం ఇచ్చి ఆన్సర్‌ షీట్‌ నింపేసింది. దానివల్ల ఎదురయ్యే ఇబ్బందుల కంటే తన వేదనాభరిత జీవితం లోకానికి తెలియాలన్న ఆమె ఉద్దేశం ఫలితం ఇచ్చింది. పేపరు దిద్దేందుకు సిద్ధపడిన టీచర్‌ ఒక్కో వాక్యం చదువుతూ ఆశ్చర్యానికి, ఆగ్రహానికి గురయ్యారు. బాలిక మనోవేదనను బాలల సంరక్షణ కమిటీ దృష్టికి తేవడంతో విషయం పోలీసుల వరకు వెళ్లింది. నిందితులిద్దరినీ వారు కటకటాల వెనక్కి పంపారు.

అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ శకుంతలాయాదవ్‌ చెప్పిన వివరాల్లోకి వెళితే...హర్యానాలోని గురుగావ్‌ జిల్లాలోని బాద్‌షాపూర్‌లో ఓ బాలిక పదో తరగతి చదువుతోంది. పక్కింట్లోనే ఉండే మామయ్య, ఇంట్లోనే ఉండే పిన్ని కొడుకు గత కొంతకాంగా ఆమెను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారు. కుటుంబ సభ్యుల నుంచే ఎదురవుతున్న ఈ ఇబ్బంది నుంచి ఎలా బయటపడాలో, ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక ఆ బాలిక కుమిలిపోయింది.

ఈ నేపథ్యంలో అక్టోబరు 1వ తేదీన పాఠశాలో యూనిట్‌ టెస్ట్‌ జరిగింది. పరీక్షలో మార్కులు పోయినా తన గుండె భారం దించుకునేందుకు ఇదో మార్గంగా భావించిన బాలిక గత కొంతకాలంగా తాను ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులు, వాటివల్ల తానెంతటి నరకాన్ని అనుభవిస్తున్నదీ పూసగుచ్చినట్లు ఆన్సర్‌ షీట్‌లో పేర్కొంది. కొన్ని రోజుల తర్వాత ఈ ఆన్సర్‌ షీట్‌ దిద్దేందుకు సిద్ధమైన టీచర్‌ అందులోని విషయం చూసి షాక్‌ అయ్యారు. వెంటనే స్కూల్‌ టీచర్‌ విషయాన్ని చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ ద్వారా పోలీసులకు తెలియజేయడంతో వారు రంగంలోకి దిగారు. బాధితురాలి మామయ్య, కజిన్‌పై పోస్కో కేసు నమోదుచేసి అరెస్టు చేశారు.

More Telugu News