cbi: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ ఇంట్లో భారీ చోరీ.. దొంగను ఏడాది పాటు వెంటాడి అరెస్ట్ చేసిన పోలీసులు!

  • బంజారాహిల్స్ లోని లక్ష్మీ నారాయణ నివాసంలో చోరి
  • పోలీసులను ఆశ్రయించిన బాధితులు
  • పక్కా ఆధారాలతో నిందితుడి అరెస్ట్

కేంద్ర దర్యాప్తు బృందం (సీబీఐ) మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ నివాసంలో జరిగిన భారీ చోరీని పోలీసులు ఛేదించారు. ఈ కేసులో లక్ష్మీనారాయణ కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదుచేసిన పోలీసులు.. ఇంటిలో డ్రైవర్ గా పనిచేస్తున్న రవికుమార్ ను ఏడాది పాటు నిఘా పెట్టి అరెస్ట్ చేశారు. అతని నుంచి రూ.20 లక్షల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.

బంజారాహిల్స్ రోడ్ నెం 12లోని సంస్కృతి ప్యాలెస్ అపార్ట్‌మెంట్స్‌లో లక్ష్మీ నారాయణ కుటుంబ సభ్యులు ఉంటున్నారు. ఈ నేపథ్యంలో గతేడాది ఆగస్టులో ఓ శుభకార్యం నిమిత్తం కుటుంబ సభ్యులు స్వగ్రామానికి వెళ్లారు. తిరిగివచ్చిన తర్వాత ఇంట్లో లాకర్లను ఎవరో పగులగొట్టి ఆభరణాలను ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. దీంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంట్లో పనిచేసేవారే ఈ చోరీకి పాల్పడి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు అందరినీ ప్రశ్నించినా ఎలాంటి ఫలితం లేకపోయింది.

అయితే డ్రైవర్ ఇక్కుర్తి రవికుమార్ ప్రవర్తనపై పోలీసులకు అనుమానం వచ్చింది. అయితే సాక్ష్యాలేవీ లేకపోవడంతో దాదాపు ఏడాది కాలంగా అతనిపై అధికారులు నిఘా ఉంచారు. దీంతో ఈ చోరీకి పాల్పడింది రవి కుమారేనని అధికారులు నిర్ధారణకు వచ్చారు. అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా, తానే ఈ దొంగతనం చేసినట్లు అంగీకరించాడు. చోరీ సొత్తులో కొంతభాగాన్ని అమ్మాననీ, మిగిలినదాన్ని వేరే వాళ్లకు ఇచ్చానని తెలిపాడు. దీంతో మొత్తం సొత్తును స్వాధీనం చేసుకున్న పోలీసులు లక్ష్మీనారాయణ కుటుంబానికి అప్పగించారు.

More Telugu News