Annapurna Devi: ప్రముఖ శాస్త్రీయ సంగీత విద్వాంసురాలు అన్నపూర్ణాదేవి కన్నుమూత

  • గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న అన్నపూర్ణాదేవి
  • ఎంతోమంది విద్వాంసులను దేశానికి అందించిన అన్నపూర్ణ
  • పండిట్ రవిశంకర్ ఆమె భర్తే

ప్రముఖ శాస్త్రీయ సంగీత విద్వాంసురాలు, పద్మ భూషణ్ అవార్డు గ్రహీత అన్నపూర్ణాదేవి కన్నుమూశారు. ఈ తెల్లవారుజామున 3:51 గంటలకు ముంబైలో తుదిశ్వాస విడిచారు. హిందూస్థానీ శాస్త్రీయ సంగీతంలో దేశ ఖ్యాతిని రెపరెపలాడించిన అన్నపూర్ణాదేవి 19 ఏళ్ల వయసులోనే సంగీతంలో సత్తా చాటారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె మధ్యప్రదేశ్‌లోని మైహార్‌లో 1927లో జన్మించారు. ఆమె అసలు పేరు రోషనారా ఖాన్. మైహార్ మహారాజు బ్రిజ్ నాథ్ సింగ్ ఆమె పేరును అన్నపూర్ణాదేవిగా మార్చారు.  

తండ్రి బాబా అల్లావుద్దీన్ ఖాన్ వద్ద చిన్నప్పటి నుంచే ఆమె సంగీతంలో ఓనమాలు దిద్దారు. ప్రముఖ సంగీత విద్వాంసులైన ఆశిష్ ఖాన్ (సరోద్), అమిత్ భట్టాచార్య (సరోద్), బహదూర్ ఖాన్ (సరోద్), బసంత్ కబ్రా (సరోద్), హరిప్రసాద్ చౌరాసియా (బన్సూరి) వంటి వారు అన్నపూర్ణాదేవి శిష్యులే కావడం గమనార్హం. ప్రముఖ సంగీత విద్వాంసుడు పండిట్ రవిశంకర్‌ను అన్నపూర్ణాదేవి వివాహం చేసుకున్నారు. వీరికి ఓ కుమారుడు శుభేంద్ర శంకర్ ఉన్నారు. 1992లో కుమారుడు మృతి చెందిన తర్వాత అన్నపూర్ణాదేవి రూషికుమార్ పాండ్యా అనే మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్‌ను వివాహం చేసుకున్నారు. ఆయన 2013లో మృతి చెందారు.

More Telugu News