Uttar Pradesh: ప్రభుత్వ ఆసుపత్రి నిర్లక్ష్యం.. ఆరుబయటే చిన్నారికి జన్మినిచ్చిన మహిళ!

  • ఉత్తరప్రదేశ్ లోని అలీజంగ్ లో దారుణం
  • నొప్పులతో ఆసుపత్రికి వెళ్లిన బాధితురాలు
  • ఇప్పుడే ప్రసవం జరగదని బయటకు పంపిన వైద్యులు

ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు మరోసారి తమ నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారు. నొప్పులతో ఓ గర్భిణి ఆసుపత్రికి రాగా, ప్రసవం అయ్యేందుకు ఇంకా సమయం ఉందని వెనక్కు పంపారు. దీంతో బాధితురాలు ఆసుపత్రి ప్రాంగణంలోని ఓ మరుగుదొడ్డిలో చిన్నారికి జన్మనిచ్చింది. ఈ అమానవీయ ఘటన ఉత్తరప్రదేశ్ లోని అలీజంగ్ ప్రాంతంలో చోటుచేసుకుంది.

ఇక్కడి అలీజంగ్ ప్రాంతానికి చెందిన బసంతికి పురిటి నొప్పులు మొదలయ్యాయి. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే అంబులెన్సుకు ఫోన్ చేశారు. అయినా ఎవ్వరూ స్పందించకపోవడంతో నడిపించుకుంటూనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వెంటనే కాన్పుకు ఏర్పాట్లు చేయాల్సిన వైద్యులు తీవ్ర నిర్లక్ష్యం చూపారు. ప్రసవానికి ఇంకా సమయం ఉందనీ, మళ్లీ రావాలని తిప్పిపంపారు. కానీ ఆసుపత్రి బయటకు రాగానే బసంతికి నొప్పులు తీవ్రం అయ్యాయి.

దీంతో బాధితురాలు సమీపంలో ఉన్న మరుగుదొడ్డిలో చిన్నారికి జన్మనిచ్చింది. ఈ వ్యవహారం మీడియాలో రావడంతో అప్రమత్తమైన ఆసుపత్రి సిబ్బంది తల్లీబిడ్డలను చేర్చుకున్నారు. మరోవైపు ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.

More Telugu News