Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో చరిత్ర సృష్టించనున్న శివరాజ్ సింగ్ చౌహాన్.. మళ్లీ ఆయనదే పీఠం!

  • వరుసగా నాలుగోసారి సీఎం పీఠాన్ని అధిరోహించనున్న శివరాజ్
  • గతంతో పోలిస్తే తగ్గనున్న బీజేపీ స్థానాలు
  • గణనీయంగా పెరుగుతున్న కాంగ్రెస్ స్థానాలు

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చరిత్ర సృష్టించేందుకు సిద్ధమవుతున్నారు. వరుసగా నాలుగోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించేందుకు సిద్ధమవుతున్నారు. ఇండియా టీవీ-సీఎన్ఎక్స్ నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. వచ్చే నెల 28న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 128 స్థానాలు సాధించి అధికారంలోకి వస్తుందని సర్వే పేర్కొంది. కాంగ్రెస్‌కు 85, బీఎస్పీకి 8, ఇతరులకు 9 స్థానాలు వస్తాయని తెలిపింది.

మధ్యప్రదేశ్‌లో మొత్తం 230 అసెంబ్లీ స్థానాలు ఉండగా, 2013 ఎన్నికల్లో బీజేపీ 165 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ 58, బీఎస్పీ 4, ఇతరులు మూడు స్థానాల్లో విజయం సాధించారు. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి బీజేపీ స్థానాలు తగ్గనుండగా, కాంగ్రెస్ గణనీయంగా పుంజుకోనున్నట్టు సర్వేలో వెల్లడైంది. బీజేపీ 42.5 శాతం, కాంగ్రెస్ 37.19 శాతం, బీఎస్పీ 7.7 శాతం ఓట్లు సొంతం చేసుకుంటుందని సర్వే తేల్చింది. అలాగే, సీఎం అభ్యర్థి శివరాజ్ సింగ్‌కు 40.35 శాతం, కాంగ్రెస్ నేతలు జ్యోతిరాదిత్య సింధియాకు 22.19 శాతం, కమల్‌నాథ్‌‌కు 18.08 శాతం మంది మద్దతు లభించింది. కాంగ్రెస్ కనుక అధికారంలోకి వస్తే ఎవరు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని ప్రశ్నించగా జ్యోతిరాదిత్యకు 42.62 శాతం మంది ఓటేశారు.

More Telugu News