Hyderabad: కోహ్లీకి కిస్సు.. కడప జిల్లా యువకుడిపై మూడు సెక్షన్ల కింద కేసు నమోదు

  • స్టాండ్స్ నుంచి దూకి కోహ్లీ వద్దకు వెళ్లి హగ్
  • ముద్దు పెట్టి సెల్ఫీతో సంబంరం
  • విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపైనా చర్యలు

టీమిండియా సారథి విరాట్ కోహ్లీకి కిస్సిచ్చి సెల్ఫీ దిగి హల్‌చల్ చేసిన కడప జిల్లాకు చెందిన మొహమ్మద్ ఖాన్‌పై మూడు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. భారత్-విండీస్ జట్ల మధ్య శుక్రవారం హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో రెండో టెస్టు ప్రారంభమైంది.

విండీస్ ఇన్నింగ్స్ 15వ ఓవర్లో కుల్దీప్ యాదవ్ చివరి బంతి వేయగానే స్టాండ్స్ నుంచి ఒక్కసారిగా మైదానంలోకి దూకిన మొహమ్మద్ ఖాన్ మిడ్ వికెట్‌లో ఫీల్డింగ్ చేస్తున్న కోహ్లీ దగ్గరికి వెళ్లి ఆలింగనం చేసుకున్నాడు. అతడిపై చేయి వేసి సెల్ఫీ తీసుకున్నాడు. ముద్దు కూడా పెట్టాడు. ఏం జరుగుతోందో తెలియక అంప్లైర్లు, ఆటగాళ్లు, స్టాండ్స్‌లోని ప్రేక్షకులు అలాగే చూస్తూ ఉండిపోయారు. కోహ్లీతో సెల్ఫీ ముచ్చట తీరడంతో మొహమ్మద్ ఖాన్ ముఖం వెలిగిపోతుండగా, బౌండరీ లైన్ వద్ద ఉన్న బౌన్సర్లు యువకుడిని తీసుకెళ్లి పోలీసులకు అప్పగించారు.
 
అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు మూడు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 19 ఏళ్ల మొహమ్మద్ ఖాన్ డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నట్టు తెలిపారు. మ్యాచ్ చూసేందుకు గురువారం కడప నుంచి రైలులో హైదరాబాద్ చేరుకున్న ఖాన్ సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్స్‌లో వంద రూపాయల టికెట్ కొనుక్కుని మ్యాచ్ చూసేందుకు ఉప్పల్ వెళ్లాడు. కాగా, విధుల్లో నిర్లక్ష్యం వహించిన పోలీసులపై శాఖాపరమైన చర్యలు తీసుకోనున్నట్టు రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ తెలిపారు.

More Telugu News