nadendla manohar: జనసైనికుడిగా కష్టపడి పని చేసేందుకు వచ్చా: నాదెండ్ల మనోహర్

  • అంకితభావం ఉన్న వ్యక్తి పవన్
  • పవన్ అడుగుజాడల్లో నడవడం మనందరి అదృష్టం
  • సమాజానికి మేలు చేయాలన్నదే పవన్ తపన

ఈరోజు నుంచి జనసైనికుడిగా కష్టపడి పని చేసేందుకు వచ్చానని జనసేన పార్టీలో చేరిన నాదెండ్ల మనోహర్ అన్నారు. ‘జనసేన’లోకి నాదెండ్లను పవన్ కల్యాణ్ సాదరంగా ఆహ్వానించిన అనంతరం, ఆయన మాట్లాడుతూ, పవన్ కల్యాణ్ ఆలోచనా విధానం, అంకిత భావం గురించి, సమాజానికి ఏవిధంగా మేలు చేయాలనే ఆయన తపన గురించి చాలా తక్కువ మందికి తెలుసని అన్నారు.

రాజకీయాల్లో అంకిత భావంతో పని చేయాలనే ఉద్దేశ్యం ఉన్న వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారని, అటువంటి వ్యక్తుల్లో పవన్ కూడా ఒకరని కొనియాడారు. పవన్ అడుగుజాడల్లో నడవడం మనందరి అదృష్టమని అన్నారు. రాజకీయ మార్పుల గురించి ఎవరూ ఊహించలేమని, ఒక్కోసారి మార్పులు లేకుండా అలానే ఉండవచ్చని అభిప్రాయపడ్డ మనోహర్, కన్వీనెంట్ పాలిటిక్స్ ఈరోజు ఎక్కువైపోయాయని, ఒకో పార్టీ, ఒకో నాయకుడు ఒకో విధంగా మాట్లాడుతూ ఉంటారని అన్నారు. ఒకే నాయకుడు నాలుగు ఉపన్యాసాలు చేయాల్సి వస్తే నాలుగు విధాలుగా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఏ అంకితభావంతో, విలువలతో అయితే పవన్ రాజకీయాల్లోకి వచ్చారో, వాటిని జనసేన సైనికులందరూ కూడా పుణికిపుచ్చుకోవాలని సూచించారు.

More Telugu News