babli project: ధర్మాబాద్ కోర్టులో చంద్రబాబుకు ఊరట.. అభియోగాలు నమోదయ్యే వరకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు!

  • 2010లో ఆందోళన చేపట్టిన చంద్రబాబు
  • బాబు సహా పలువురు టీడీపీ నేతలపై కేసులు
  • ధర్మాబాద్ కోర్టులో వాదించిన సిద్ధార్థ్ లూత్రా

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఊరట లభించింది. మహారాష్ట్రలో నిర్మిస్తున్న బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా 2010లో ఆందోళనలు చేసిన కేసులో చంద్రబాబుకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కల్పిస్తూ ధర్మాబాద్ న్యాయస్థానం ఈ రోజు ఉత్తర్వులు జారీచేసింది. ఈ కేసులో సీఎం చంద్రబాబుకు  2018 జులై 5న కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ ను జారీచేసింది. అయితే తొలుత పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి కోర్టుకు హాజరయ్యే అంశాన్ని చంద్రబాబు పరిశీలించారు. కానీ, అధికారులు, సన్నిహిత వర్గాల సూచన మేరకు రీకాల్ పిటిషన్ వేయాలని నిర్ణయించారు.

ఈ నేపథ్యంలో ఢిల్లీ నుంచి మహారాష్ట్రకు చేరుకున్న సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా, మరో న్యాయవాది సుబ్బారావు.. చంద్రబాబు తరఫున రీకాల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఈరోజు ఇరు పక్షాలు గంటన్నర సేపు కోర్టులో తమ వాదనలు వినిపించాయి.

‘ఈ కేసు వ్యవహారమై మీడియాలో వివరాలు వచ్చాకే నాపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయినట్లు తెలిసింది. రాజకీయ ప్రతీకారంతో కేసులో నన్ను ఇరికించారు. దీనికి సంబంధించి సమన్లు/నోటీసు/బెయిలబుల్‌ వారెంట్‌ నాకు అందలేదు. అభియోగపత్రం దాఖలయ్యాక కూడా కనీసం మొదటి నోటీసూ అందలేదు.

పోలీసులు నమోదు చేసిన సెక్షన్లు తీవ్రమైనవేమీ కావు. నాన్ బెయిలబుల్ వారెంట్ ను ఉపసంహరించుకోవడానికి ఇది తగిన కేసు. ఉన్నత న్యాయస్థానాలు ఇచ్చిన పలు తీర్పుల నేపథ్యంలో వారెంట్‌ రీకాల్‌ సమయంలో నిందితుడు న్యాయస్థానం ముందు హాజరు కావాల్సిన అవసరం లేదు. ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకొని 2018 జులై 5న జారీచేసిన నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ను రీకాల్‌ చేయండి’ అని పిటిషన్ లో కోరారు.

 వాదనలు విన్న న్యాయమూర్తి.. ఈ నెల 15న జరిగే విచారణతో పాటు అభియోగాలు నమోదయ్యే వరకూ వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాల్సిన అవసరం లేదని ఉత్తర్వులు జారీచేశారు. నాన్ బెయిలబుల్ వారెంట్ పొందిన మిగిలిన 15 మంది నేతలు ఈ నెల 15న జరిగే విచారణకు హాజరుకావాలని స్పష్టం చేశారు. ధర్మాబాద్ లీగల్ సర్వీసెస్ కమిటీ వద్ద రూ.15,000 డిపాజిట్ చేయాలని ఆదేశించారు.

More Telugu News