గోడను ఢీకొట్టిన ఎయిర్ ఇండియా విమానం!

12-10-2018 Fri 11:56
  • తిరుచ్చి నుంచి దుబాయ్ కి బయలుదేరిన విమానం
  • టేకాఫ్ సమయంలో గోడకు ఢీ
  • ఆపై ముంబైలో సేఫ్ ల్యాండింగ్
  • త్రుటిలో తప్పిన ఘోర ప్రమాదం
తమిళనాడులోని తిరుచ్చి నుంచి దుబాయ్ కి 136 మంది ప్రయాణికులు, సిబ్బందితో బయలుదేరిన ఎయిర్‌ ఇండియా విమానానికి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. విమానాశ్రయం నుంచి టేకాఫ్ అవుతున్న సమయంలో పైలట్ తప్పిదం కారణంగా ప్రహరీ గోడను విమానం ఢీకొంది. ఈ ప్రమాదంలో ప్రయాణికులెవరూ గాయపడలేదు. టేకాఫ్ అవుతున్న విమానం రెండు చక్రాలు గోడను ఢీకొన్న తరువాత విమానం గాల్లోకి లేచింది. దీన్ని గమనించిన పైలట్లు, విషయం ముంబై విమానాశ్రయంకి తెలిపి, విమానాన్ని దారి మళ్లించి, ఉదయం 5.35 గంటల ప్రాంతంలో సేఫ్ ల్యాండింగ్ చేశారు. ఆపై ప్రయాణికులను మరో విమానంలో దుబాయ్ కి పంపించారు.

ఈ విమానంలో కెప్టెన్ గా ఉన్న డీ గణేష్ బాబుకు, బోయింగ్ 737 విమానాలు నడపడంలో 3,600 గంటల అనుభవముందని, ఫస్ట్ ఆఫీసర్ కెప్టెన్ అనురాగ్ కు సైతం 3000 గంటల అనుభవముందని అధికారులు తెలిపారు. తిరుచ్చి విమానాశ్రయం ప్రహరీ గోడవద్ద విమానం యాంటీనా, ఇతర భాగాలు కొన్ని కనిపించాయని, ఇద్దరు పైలట్లనూ విధుల నుంచి తప్పించి, జరిగిన ఘటనపై విచారణకు ఆదేశించామని డీజీసీఏ అధికారి ఒకరు తెలిపారు.