Telangana: తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో.. నేడు ఓటర్ల జాబితా విడుదల!

  • తొలుత హైకోర్టుకు ఓటర్ల జాబితా
  • అనంతరం బయటపెట్టనున్న ఈసీ
  • 2.61 కోట్ల మంది ఓటర్లతో జాబితా

తెలంగాణ అసెంబ్లీకి డిసెంబర్ 7న ఎన్నికలు నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు రాష్ట్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాను ప్రకటించనుంది. ఈ నెల 8నే జాబితాను ప్రకటించాల్సి ఉన్నప్పటికీ హైకోర్టులో కేసు విచారణలో ఉన్న నేపథ్యంలో వాయిదా పడింది. ఓటర్ల జాబితాపై హైకోర్టు బుధవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో ఈసీ ఈ రోజు ఓటర్ల వివరాలతో జాబితాను విడుదల చేయనుంది. తొలుత ఈ వివరాలను ఈ రోజు హైకోర్టుకు సమర్పించిన తర్వాత ప్రజలకు అందుబాటులో ఉంచనున్నారు.

ప్రస్తుతం ముసాయిదా జాబితా ప్రకారం రాష్ట్రంలో 2.61 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. అయితే 2014 ఎన్నికల్లో తెలంగాణలో ఈ సంఖ్య 2.81 కోట్లుగా ఉండేది. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం వచ్చే నెల 19 వరకూ నామినేషన్లు స్వీకరిస్తారు. నామినేషన్ల గడువుకు 10 రోజుల ముందు వరకూ ఓటర్ల నమోదు ప్రక్రియ కొనసాగుతుంది. ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో అదనంగా 1,000 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఎన్నికల సంఘం భావిస్తోంది.

More Telugu News