Stock Market: స్టాక్ మార్కెట్ అంతే... 45 నిమిషాల్లో రెండు లక్షల కోట్ల లాభం!

  • గురువారం నాడు మార్కెట్ కు భారీ నష్టం
  • ఈ ఉదయం వెల్లువెత్తిన కొనుగోళ్లు
  • 600 పాయింట్లకు పైగా లాభం

గురువారం నాడు ఘోర నష్టాన్ని చవిచూసి, సుమారు రూ. 4 లక్షల కోట్ల రూపాయల మార్కెట్ కాప్ ను కోల్పోయిన భారత స్టాక్ మార్కెట్ నేడు తేరుకుంది. ఆసియా మార్కెట్ల నుంచి అందిన సంకేతాలు పాజిటివ్ గా ఉండటం, పలు కంపెనీల ఈక్విటీలు తక్కువ ధరకు లభిస్తుండటంతో కొనుగోళ్లు వెల్లువెత్తాయి. దీంతో సెన్సెక్స్ 45 నిమిషాల వ్యవధిలోనే 550 పాయింట్లకు పైగా పెరిగింది. దీంతో నిన్న నష్టపోయిన మార్కెట్ కాప్ లో సగం తిరిగి వచ్చినట్లయింది. ఆ తరువాత కూడా మార్కెట్ జోరు కొనసాగింది.

ఈ ఉదయం 10.10 గంటల సమయంలో బొంబాయి స్టాక్ మార్కెట్ సూచిక సెన్సెక్స్, క్రితం ముగింపుతో పోలిస్తే 628 పాయింట్లు పెరిగి 34,629 పాయింట్లకు చేరగా, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ, 177 పాయింట్లు పెరిగి 10,411 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థల ఈక్విటీలు లాభాల్లో ఉండగా, టెక్, ఐటీ కంపెనీలు నష్టాల్లో ఉన్నాయి. బజాజ్ ఫైనాన్స్, హింద్ పెట్రో, బజాజ్ ఫిన్ సర్వ్, యస్ బ్యాంక్ తదితర కంపెనీలు లాభాల్లోనూ, హెచ్సీఎల్ టెక్, టీసీఎస్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, విప్రో తదితర సంస్థలు నష్టాల్లోనూ నడుస్తున్నాయి.

More Telugu News