Amit Shah: 2002లో నరేంద్ర మోదీ, ఇప్పుడు కేసీఆర్ చేస్తున్నది ఒకటే: అమిత్ షాకు టీఆర్ఎస్ కౌంటర్

  • నాడు మోదీ ముందస్తుకు వెళ్లలేదా?
  • మీరు చేస్తే ఒప్పు, మేము చేస్తే తప్పా?
  • అమిత్ షాపై విరుచుకుపడ్డ టీఆర్ఎస్ ఎంపీ వినోద్ కుమార్

తెలంగాణలో ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లాలని కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని ఇటీవల అమిత్ షా విమర్శించిన నేపథ్యంలో, ఆ పార్టీ నేతలు ఆయనకు కౌంటర్ ఇచ్చారు. 2002లో గుజరాత్ సీఎంగా ఉన్న వేళ, నరేంద్ర మోదీ కూడా ముందస్తు ఎన్నికలకు వెళ్లారని గుర్తు చేసిన కరీంనగర్ ఎంపీ బీ వినోద్ కుమార్, ఇప్పుడు కేసీఆర్ చేసింది కూడా అదేనని అన్నారు. తాము చేసింది సరైనదే అయినప్పుడు, అదే పని ఇతరులు చేస్తే తప్పెలా అవుతుందని ఆయన ప్రశ్నించారు.

అన్ని రాజకీయ పార్టీలూ ఏదో ఒక సమయంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లినవేనని, 2002లో ఎనిమిది నెలలకు ముందే మోదీ, ఎన్నికలకు ఎందుకు వెళ్లారో చెప్పగలరా? అని ఆయన ప్రశ్నించారు. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, అటల్ బిహారీ వాజ్ పేయి, ఎన్టీ రామారావు, చంద్రబాబు తదితర నేతలెంతో మంది ముందస్తు ఎన్నికలకు వెళ్లారని గుర్తు చేశారు.

కాగా, బుధవారం నాడు కరీంనగర్ లో జరిగిన బీజేపీ ఎన్నికల సభలో అమిత్ షా మాట్లాడుతూ, నరేంద్ర మోదీకి భయపడే, కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేసి, ముందుగానే ఎన్నికలకు వెళ్లారని విమర్శించిన సంగతి తెలిసిందే. కేసీఆర్ నిర్ణయం వల్ల వందల కోట్ల ప్రజా సంపద ఎన్నికల ఖర్చు రూపంలో హారతి కానుందని అన్నారు.

More Telugu News