Patibandla Chandrasekhara Rao: న్యాయకోవిదుడు, పద్మభూషణ్ అవార్డు గ్రహీత పాటిబండ్ల కన్నుమూత.. చంద్రబాబు దిగ్భ్రాంతి!

  • రెండు నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న పాటిబండ్ల
  • నేడు జూబ్లీహిల్స్‌లో అంత్యక్రియలు
  • సంతాపం తెలిపిన చంద్రబాబు, జస్టిస్ ఎన్వీ రమణ

రెండు నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రముఖ న్యాయ కోవిదుడు, పద్మభూషణ్ అవార్డు గ్రహీత డాక్టర్ పాటిబండ్ల చంద్రశేఖరరావు (82) గురువారం  కన్నుమూశారు. ఆయనకు భార్య, నలుగురు కుమార్తెలు ఉన్నారు. నేటి ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.

ఏప్రిల్ 22, 1936లో కృష్ణా జిల్లా వీరులపాడులో పాటిబండ్ల జన్మించారు. మద్రాస్ యూనివర్సిటీలో న్యాయశాస్త్రంలో మాస్టర్స్, పీహెచ్‌డీ చేశారు.  హైదరాబాద్ నల్సార్ విశ్వవిద్యాలయం నుంచి ఎల్‌ఎల్‌డీ పట్టా అందుకున్నారు. 1963 నుంచి 67 వరకు ఇండియన్ సొసైటీ ఫర్ ఇంటర్నేషనల్ లా ఇనిస్టిట్యూట్‌లో పరిశోధకుడిగా పనిచేశారు. నెహ్రూ హయాంలో రక్షణ మంత్రిగా పనిచేసిన వీకే కృష్ణ మీనన్ దీనిని ప్రారంభించారు. 1994 నుంచి 2000 సంవత్సరం వరకు అదే సంస్థకు పాటిబండ్ల అధ్యక్షుడిగా పనిచేశారు. 1967లో విదేశీ వ్యవహారాల శాఖలో పనిచేశారు. దేశం తరపున 18 ఏళ్లపాటు సుముద్ర న్యాయ వివాదాల ట్రైబ్యునల్‌లో సేవలందించిన ఏకైక వ్యక్తిగా చంద్రశేఖరరావు రికార్డులకెక్కారు.

1972 నుంచి 1976 వరకు ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత విభాగంలో న్యాయ సలహాదారుగా పనిచేశారు. అలాగే, కేంద్ర న్యాయశాఖలోనూ వివిధ హోదాల్లో పనిచేశారు. 1996 నుంచి సముద్ర చట్టాల ట్రైబ్యునల్‌లో న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు. ఆయన సేవలకు గుర్తుగా 2012లో ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారంతో పాటిబండ్లను సత్కరించింది. చంద్రశేఖరరావు మృతి పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తన ప్రగాఢ సంతాపం తెలిపారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఫోన్ చేసి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు.

More Telugu News