Chandrababu: రాత్రంతా మేల్కొనే ఉన్న చంద్రబాబు.. తిత్లీ తుపానుపై సమీక్ష, సూచనలు.. క్షణక్షణం అప్రమత్తం!

  • రాత్రంతా జాగారం చేసిన చంద్రబాబు
  • అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ సూచనలు
  • ఆస్తి, ప్రాణ నష్టాన్ని తగ్గించడంలో కీలక పాత్ర

తిత్లీ తుపాను నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు బుధవారం రాత్రంతా మేల్కొనే ఉన్నారు. క్షణక్షణం అధికారులను అప్రమత్తం చేస్తూ ప్రాణ, ఆస్తినష్టాన్ని తగ్గించడంలో సీఎం కీలక పాత్ర పోషించారని అధికారులు చెబుతున్నారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తే కంటిమీద కునుకు లేకుండా పనిచేస్తుండడంతో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. ఆర్టీజీఎస్ నుంచి వచ్చే సమాచారం ఆధారంగా చంద్రబాబు ఉన్నతాధికారులతో రాత్రంతా మాట్లాడుతూనే ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడాలని ఆదేశించారు.

చంద్రబాబు ఆదేశాలతో అప్రమత్తమైన కిందిస్థాయి సిబ్బంది కూడా చురుగ్గా పనిచేశారు. ఎక్కడికక్కడ ప్రజలను అప్రమత్తం చేస్తూ నష్టాన్ని చాలా వరకు నివారించగలిగారు. అనంతపురం జిల్లా పర్యటన నుంచి బుధవారం సాయంత్రానికి తిరిగొచ్చిన సీఎం కలెక్టర్లు, ఉన్నతాధికారులతో తిత్లీ తుపానుపై మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.

విపత్తు నిర్వహణ, వాతావరణ, జలవనరుల శాఖ అధికారులకు పలు సూచనలు చేశారు. బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించి వారికి ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని ఆదేశించారు. గురువారం తెల్లవారుజామున మరోమారు అధికారులతో పరిస్థితిని సమీక్షించారు. మళ్లీ ఉదయం పదిన్నర గంటలకు ప్రజాప్రతినిధులు, కలెక్టర్లతో మాట్లాడారు.

More Telugu News