L.Ramana: ఎల్.రమణ, జీవన్ రెడ్డి కవల పిల్లలు..చిన్నప్పుడు కుంభమేళాలో తప్పిపోయి మొన్ననే కలిశారు: ఎంపీ కవిత సెటైర్లు

  • మీ రెండు పార్టీలు తెలంగాణను నాశనం చేశాయి
  • ఉద్యమ ఆకాంక్షల గురించి మీరా మాకు చెప్పేది?
  • తెలంగాణ అభివృద్ధి వెనుకబడేలా చేసింది మీ పార్టీలేగా

తెలంగాణలో కాంగ్రెస్-టీడీపీ పొత్తుపై టీఆర్ఎస్ ఎంపీ కవిత విమర్శలు గుప్పించారు. జగిత్యాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, టీ-టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, టీ-కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డిపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వాళ్లిద్దరూ ఒకే వేదికపైకొచ్చి ఒకే చోట కూర్చుంటున్నారని, అసలు, వాళ్లిద్దరూ కవల పిల్లలా? చిన్నప్పుడు కుంభమేళాలో తప్పిపోయి మొన్ననే కలిశారా అన్నంత ప్రేమగా ఉంటున్నారని, ఒకరినొకరు బాగా పొగుడుకుంటున్నారని వెటకారంగా మాట్లాడారు.

అసలు వాళ్లిద్దరూ కలవడమే విచిత్రమైన దృశ్యమంటే, వాళ్లిద్దరూ కలిసిన తర్వాత మాట్లాడిన మాటలు మరీ విచిత్రంగా ఉన్నాయని విమర్శించారు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను కేసీఆర్ నెరవేర్చడం లేదని, దేని కోసమైతే ఉద్యమం సాగిందో ఆ ప్రయోజనాలు ప్రజలకు అందడం లేదని వారు విమర్శించడంపై కవిత స్పందించారు. ‘ఎల్. రమణ, జీవన్ రెడ్డి ని సూటిగా ఓ ప్రశ్న వేస్తున్నా.. అసలు, తెలంగాణ ప్రజలు ఉద్యమం చేసిందెవరి మీద? టీడీపీ, కాంగ్రెస్ పార్టీల మీద చేయలేదా?  మీ రెండు పార్టీలు తెలంగాణను నాశనం చేశాయి. ఒక్క రూపాయి కూడా నిధులు ఇవ్వకుండా తెలంగాణ అభివృద్ధి వెనుకబడేలా చేస్తేనే కదా ఉద్యమం పుట్టింది? ఉద్యమ ఆకాంక్షల గురించి మీరా టీఆర్ఎస్ పార్టీకి చెప్పేది? మీరా మాట్లాడేది?’ అని కవిత విరుచుకుపడ్డారు.

More Telugu News