Maharashtra: ‘ఏయ్, ఏం మాట్లాడుతున్నావ్.. నీ రేటెంత?‘... అత్యాచార బాధితురాలిపై మహారాష్ట్ర హోంమంత్రి నోటి దురుసు!

  • మీ టూలో భాగంగా బయటపెట్టిన బాధితురాలు
  • హోంమంత్రి దీపక్ దుర్భాషలాడినట్లు వెల్లడి
  • ఆరోపణలను ఖండించిన మంత్రి

సినీ పరిశ్రమలో లైంగిక వేధింపులపై మొదలైన ‘మీ టూ’ ఉద్యమం క్రమంగా రాజకీయ రంగానికి విస్తరిస్తోంది. కేంద్ర మంత్రి, మాజీ జర్నలిస్ట్ ఎంజే అక్బర్ తనను లైంగికంగా వేధించాడంటూ ఓ మహిళా విలేకరి ఫిర్యాదు చేయడంతో కలకలం చెలరేగింది. తాజాగా ఈ జాబితాలోకి మహారాష్ట్ర హోంమంత్రి దీపక్ వసంత్ కేసర్కార్ చిక్కుకున్నారు. అత్యాచారం కేసులో తమకు న్యాయం చేయాలని కోరుతూ మంత్రి దగ్గరకు వెళ్లగా, తనతో ఆయన అత్యంత జుగుప్సాకరంగా మాట్లాడాడని వాపోయింది. ఈ మేరకు దక్షిణ ముంబైలోని మెరైన్ డ్రైవ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.

గత నెలలో బాధితురాలు, ఆమె కుమార్తెకు మత్తు మందు ఇచ్చిన ఏడుగురు దుండగులు గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. ఈ విషయమై బాధితురాలు పోలీసులను ఆశ్రయించగా, ఒకరిని అరెస్ట్ చేసి మిగిలినవారిని వదిలేశారు. దీంతో తనకు న్యాయం చేయాలని కోరుతూ బాధితురాలు హోంమంత్రి దీపక్ ను ఆశ్రయించగా.. ఆయన దురుసుగా ప్రవర్తించారు. ‘ఏయ్.. ఏం మాట్లాడుతున్నావ్.. నీ రేటెంత? ఎక్కువ మాట్లాడకు’ అంటూ దుర్భాషలాడారని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది.

కాగా, ఈ విషయమై పోలీసులు స్పందిస్తూ.. ఫిర్యాదు గురించి హోంమంత్రికి సమాచారం అందించామన్నారు. మరోవైపు తనపై వచ్చిన ఆరోపణలను దీపక్ ఖండించారు. ఆమె తనపై తప్పుడు ఆరోపణలు చేస్తోందనీ, అయినా సదరు బాధితురాలి కుటుంబానికి సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు. ఆరోజు తన ఆఫీసులో సదరు మహిళతో పాటు మరో పాతిక మంది వరకూ ఉన్నారని పేర్కొన్నారు. ఆరోజు ఏం జరిగిందో అందరూ చూశారన్నారు.

More Telugu News