Telangana: ఆడబిడ్డ పెళ్లిలో సొంత మామ కానుక పెట్టినా, పెట్టకున్నా.. ప్రభుత్వం ఆ బాధ్యతను తీసుకుంటోంది!: కేటీఆర్

  • సిరిసిల్లను అద్భుతంగా తీర్చిదిద్దుతా
  • చేనేత కార్మికులకు ఉపాధి కల్పించాం
  • అమ్మాయి పుడితే రూ.13 వేలు ఇస్తున్నాం

సిరిసిల్ల పట్టణాన్ని అద్భుతంగా తీర్చిదిద్దే బాధ్యతను వ్యక్తిగతంగా తాను తీసుకుంటున్నానని మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. ప్రజలు ఇచ్చిన మద్దతుతోనే ఈ నాలుగేళ్లలో జిల్లా అభివృద్ధి పనులు చేపట్టగలిగామని తెలిపారు. సిరిసిల్ల పట్టణంలోకి ఎవరైనా వస్తే జరిగిన అభివృద్ధిని చూసి ఆశ్చర్యపోతున్నారని పేర్కొన్నారు. పార్కులు, రోడ్లు, వీధి లైట్లతో ఓ మోడల్ మున్సిపాలిటీగా సిరిసిల్లను తీర్చిదిద్దామని అన్నారు. సిరిసిల్లలో ఈ రోజు జరిగిన బహిరంగ సభలో కేటీఆర్ మాట్లాడారు.

సిరిసిల్ల నియోజకవర్గంలో దీపావళికల్లా ప్రతి ఇంటికి తాగునీరు, ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. పట్టణ ప్రాంతాల్లో ఉండే నేతన్నలను ఆదుకునేందుకు బతుకమ్మ చీరలు, స్కూలు యూనిఫాంల ఆర్డర్లు ఇస్తున్నామని కేటీఆర్ అన్నారు. దీని కారణంగా కేవలం నెలకు రూ.8 వేలుగా ఉన్న చేనేత కుటుంబాల ఆదాయం ఇప్పుడు రూ.16,000 నుంచి రూ.20,000 వరకు చేరుకుందన్నారు. కేసీఆర్ వచ్చిన తర్వాత రూ.75, రూ.200గా ఉన్న పెన్షన్లను ఏకంగా రూ.వెయ్యి చేశారని గుర్తుచేశారు.

రాష్ట్రంలో ఇప్పుడు 43 లక్షల మంది పేదలకు పెన్షన్లు ఇస్తున్నారని చెప్పారు. ఒకప్పుడు ఎండాకాలం వస్తే కరెంట్ ఉండేది కాదనీ, ఇప్పుడు 24 గంటలు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా అవుతోందని పేర్కొన్నారు. మరోసారి తనకు అవకాశం ఇస్తే సిరిసిల్లకు రైలు మార్గం తీసుకొస్తానని హామీ ఇచ్చారు. రేషన్ బియ్యం అందించడానికి గరిష్ట పరిమితిని ఎత్తివేశామని తెలిపారు. కేసీఆర్ ఆశీర్వాదంతో అన్ని స్కూళ్లలో మధ్యాహ్న భోజనం కింద సన్నబియ్యం అందజేస్తున్నామని చెప్పారు.

సొంత మామయ్య ఆడబిడ్డకు ఏం కానుక పెట్టినా, పెట్టకపోయినా కేసీఆర్ మాత్రం కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకం కింద రూ.1, 00,116 అందజేస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రికే రాను అంటూ భయపడ్డ ప్రజలు.. ఇప్పుడు 50 శాతం మందికిపైగా ప్రసవాల కోసం ప్రభుత్వ ఆసుపత్రులనే ఆశ్రయిస్తున్నారని చెప్పారు.

గవర్నమెంట్ ఆసుపత్రిలో ప్రసవం అయిన బాలింతకు నెలకు రూ.2 వేలు చొప్పున ఆరు నెలల పాటు అందజేస్తున్నామని అన్నారు. ఇలా మగబిడ్డ పుడితే రూ.12 వేలు, ఆడబిడ్డ పుడితే రూ.13 వేలు అందజేస్తున్నామని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని సంక్షేమ రాజ్యంగా మారుస్తున్నామని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పలువురు నేతలు టీఆర్ఎస్ లో చేరారు.

More Telugu News