karthi chidambaram: కార్తీ చిదంబరంకు షాక్.. దేశ, విదేశాల్లోని ఆస్తులు సీజ్!

  • రూ. 54 కోట్ల విలువైన ఆస్తులు సీజ్
  • ఇండియా, యూకే, స్పెయిన్ లలోని ఆస్తులు సీజ్
  • మనీ లాండరింగ్ కేసులో ఆస్తులు సీజ్ చేశామన్న అధికారులు

కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరంకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) షాక్ ఇచ్చింది. అతనికి సంబంధించిన దేశ, విదేశాల్లో ఉన్న రూ. 54 కోట్ల విలువైన ఆస్తులను సీజ్ చేసింది. మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి ఇండియా, యునైటెడ్ కింగ్ డమ్, స్పెయిన్ లలో ఉన్న ఆస్తులను సీజ్ చేసినట్టు అధికారులు తెలిపారు.

ఐఎన్ఎక్స్ మీడియా విదేశాల్లో రూ. 300 కోట్ల మేర పెట్టుబడులు పెట్టేందుకు కార్తీ సహకరించారనే ఆరోపణల నేపథ్యంలో, ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఈ మీడియా సంస్థ షీనా బోరా హత్య కేసులో నిందితులైన పీటర్ ముఖర్జియా, ఇంద్రాణి ముఖర్జియాలకు చెందింది. లంచం తీసుకుని ఐఎన్ఎక్స్ మీడియాకు సహకరించారనే ఆరోపణలు కార్తీపై ఉన్నాయి. యూపీఏ ప్రభుత్వ హయాంలో కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్న తన తండ్రి అధికారాన్ని కార్తీ ఈ లావాదేవీలకు ఉపయోగించుకున్నారని ఈడీ ఆరోపిస్తోంది.

ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్ఏ) కింద తమిళనాడులోని కొడైకెనాల్, ఊటీలో ఉన్న ఆస్తులు, సెంట్రల్ ఢిల్లీలోని జోర్ బాగ్ లో ఉన్న ఒక ఫ్లాట్ ను సీజ్ చేశారు. వీటితో పాటు యూకేలోని సోమర్ సెట్ లో ఉన్న ఒక కాటేజ్, ఒక ఇల్లు.... స్పెయిన్ లోని బార్సిలోనాలో ఉన్న టెన్నిస్ క్లబ్ లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు చెన్నైలోని ఒక బ్యాంకులో అడ్వాంటేజ్ స్ట్రాటజిక్ కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరు మీద ఉన్న రూ. 90 లక్షల ఫిక్స్ డ్ డిపాజిట్లను కూడా అటాచ్ చేశారు. వీటన్నిటి విలువ రూ. 54 కోట్లుగా ఉంటుందని దర్యాప్తు అధికారులు తెలిపారు. 

More Telugu News