Donald Trump: చూస్తుండండి... నిక్కీ హేలీ బోలెడు డబ్బు సంపాదిస్తుంది!: డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు

  • ఇటీవల ఐరాస పదవికి నిక్కీ రాజీనామా
  • తదుపరి చేయబోయే పనుల ద్వారా చాలా డబ్బు ఆమెకు రానుంది
  • మరో రూపంలో ఆమె తిరిగి ప్రజల ముందుకు వస్తుంది
  • వైట్ హౌస్ లో మీడియాతో డొనాల్డ్ ట్రంప్

భారత సంతతి అమెరికన్ నేత, ఇటీవల ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారి పదవికి రాజీనామా చేసిన నిక్కీ హేలీని ఉద్దేశించి, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆమెను ఓ అద్భుత మహిళగా అభివర్ణించిన ఆయన, ఆమె తదుపరి చేయబోయే పనుల ద్వారా చాలా డబ్బును సంపాదించనుందని అన్నారు. ప్రైవేటు రంగంలో ఆమె చేయబోయే ఉద్యోగం కాసుల వర్షాన్ని కురిపించనుందని వ్యాఖ్యానించారు.

 కాగా, 46 ఏళ్ల నిక్కీ హేలీ, గత మంగళవారం నాడు తన పదవికి రాజీనామా చేయగా, ఆ వెంటనే ట్రంప్ దాన్ని ఆమోదించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సంవత్సరాంతం వరకూ ఆమె తన పదవిలో కొనసాగుతారు. "డిసెంబర్ చివరి వరకూ నిక్కీ ఆమె బాధ్యతలు నిర్వహిస్తారు. ఆమె నాకు మంచి స్నేహితురాలు. ఆమె గొప్ప వ్యక్తి. నిక్కీ బయటకు వెళ్లేలోగా, తనతో మరికొంత సమయాన్ని గడపాలని కోరుకుంటున్నాను. ఆపై ఆమె మరో ఉద్యోగం చూసుకుంటారని, దానిలో చాలా డబ్బు సంపాదిస్తారని, మరో రూపంలో ఆమె ప్రజల ముందుకు వస్తారని అనుకుంటున్నా" అని బుధవారం నాడు వైట్ హౌస్ లో జరిగిన ప్రెస్ మీట్ లో ట్రంప్ వ్యాఖ్యానించారు.

కాగా, దాదాపు పదేళ్లకు పైగా ప్రజా జీవితంలో గడిపిన తాను, కొంతకాలం విశ్రాంతి తీసుకోవాలని భావిస్తున్నట్టు తన రాజీనామా అనంతరం నిక్కీ హేలీ వ్యాఖ్యానించిన సంగతి విదితమే.

More Telugu News