school: పాఠశాలలో మతవివక్ష.. హిందూ, ముస్లిం విద్యార్థులను విడిగా కూర్చోబెడుతున్న స్కూల్!

  • దేశరాజధానిలోని ఓ ప్రైమరీ స్కూలులో దారుణం
  • వెలుగులోకి తెచ్చిన జాతీయ మీడియా
  • విచారణకు ఆదేశించిన అధికారులు

చదువు చెప్పడమే కాకుండా పిల్లలకు మంచి నడవడికను నేర్పడమే పాఠశాలల ముఖ్య లక్ష్యం. కానీ దేశరాజధానిలో మాత్రం ఓ పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు ఇందుకు పూర్తి విరుద్ధంగా ప్రవర్తించారు. పిల్లలను మతం ఆధారంగా హిందువులు, ముస్లింలుగా విభజించి కూర్చోబెట్టారు. దీనికి ఆహార అలవాట్లను ఓ సాకుగా చూపారు. దీంతో పాఠశాల వ్యవహారశైలిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఉత్తరఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ లోని వజీరాబాద్ ప్రాథమిక పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ పాఠశాల ప్రిన్సిపాల్ బదిలీపై వెళ్లగానే సీబీ సింగ్ షెహ్రావత్ ను ఇన్ చార్జ్ గా నియమించారు. ఈ నేపథ్యంలో షెహ్రావత్ తో కొందరు టీచర్లు కలిసి విద్యార్థులను మతం ఆధారంగా సెక్షన్ ఏ, బీలుగా విభజించారు. హిందూ విద్యార్థులను ఏ సెక్షన్ లో, ముస్లిం విద్యార్థులందరినీ బీ సెక్షన్ లో కూర్చోబెట్టారు. ఈ విషయమై మీడియా ప్రశ్నించగా, కొందరు విద్యార్థుల ఆహారపు అలవాట్ల కారణంగా మిగతా పిల్లలు ఇబ్బంది పడకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.

అందరూ ఒకేచోట ఉంటే గొడవ పడుతున్నారనీ, అలా కాకుండా సెక్షన్లుగా విడగొట్టడంతో ఇప్పుడు అల్లరి తగ్గిందన్నారు. ఈ విషయాన్ని ఓ ఆంగ్ల పత్రిక వెలుగులోకి తీసుకొచ్చింది. దీంతో ఉన్నతాధికారులు స్పందిస్తూ.. మతం ఆధారంగా క్లాస్ ను విభజించినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ ఘటనపై ఇప్పటికే విచారణకు ఆదేశించామన్నారు.

More Telugu News