Jayashankar Bhupalpally District: కలెక్టర్ గారిని వెయిటింగులో పెట్టిన ఉద్యోగులు!

  • భూపాలపల్లి జిల్లాలో ప్రభుత్వ సిబ్బంది నిర్వాకం
  • ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మార్వో
  • సైలెంట్ గా వెళ్లిపోయిన కలెక్టర్ వెంకటేశ్వర్లు

ప్రభుత్వ అధికారులు సరైన టైమ్ కు ఆఫీసుకు రారనీ, చెప్పిన పనులు సక్రమంగా చేయరని అపవాదు ఉంది. కొందరు అధికారులు తీవ్ర నిర్లక్ష్యంతో వ్యవహరిస్తూ సామాన్యులను ఇబ్బందిపెట్టిన ఘటనలను మనం చూసుంటాం. కానీ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అధికారులు వీరందరికంటే ఓ మెట్టుపైనే ఉన్నారు. ఎందుకంటే వారంతా సాక్షాత్తూ జిల్లా కలెక్టర్ నే వెయిటింగులో పెట్టారు. ఏకంగా జిల్లా కలెక్టర్ ను రోడ్డుపై 10 నిమిషాలు నిలబడేలా చేశారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎం)ను అధికారులు జిల్లా కేంద్రంలోని మినీ ఫంక్షన్ హాలులో భద్రపరిచారు. దీంతో ఏర్పాట్లను పరిశీలించేందుకు కలెక్టర్ వెంకటేశ్వర్లు ఫంక్షన్ హాలుకు వచ్చారు. కలెక్టర్ పర్యటనపై ముందే సమాచారం ఇచ్చినా సిబ్బంది మాత్రం పూర్తి నిర్లక్ష్యంగా ప్రవర్తించారు. కలెక్టర్ హాలు వద్దకు చేరుకున్నా ఎవ్వరూ తాళాలతో రాలేదు.

గత్యంతరం లేక కలెక్టర్ అక్కడే 10 నిమిషాల పాటు తచ్చాడారు. చివరికి ఓ ఉద్యోగి తాళాలు తెచ్చి హాలును తెరవడంతో కలెక్టర్ లోపలకు వెళ్లారు. ఈ ఘటనతో స్థానిక సిబ్బందిపై ఎమ్మార్వో సత్యనారాయణ స్వామి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే కలెక్టర్ మాత్రం ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు.

More Telugu News