Airport: ఎయిర్ పోర్టుల్లో ఇకపై మరింత కఠినంగా వ్యవహరించనున్న సీఐఎస్ఎఫ్!

  • ఎవరిని చూసినా చిరునవ్వు నవ్వరాదు
  • భద్రత విషయంలో అశ్రద్ధ లేదన్న సంకేతాలు వెళ్లాలి
  • ఏవియేషన్ సెక్యూరిటీ చీఫ్ ఎంఏ గణపతి

మీరు ఎయిర్ పోర్టులో అడుగు పెట్టిన వేళ, భద్రతా సిబ్బంది ముఖంలో ఇకపై నవ్వులు కనిపించవు. వారు మరింత సీరియస్ గా మిమ్మల్ని చూస్తూ తనిఖీలు చేస్తారు. విమానాశ్రయాల్లో సీఐఎస్ఎఫ్ (సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సెస్) సిబ్బంది వ్యవహార శైలి మారిందని మీకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇండియాలోని ఎయిర్ పోర్టుల భద్రతను సీఐఎస్ఎఫ్ పర్యవేక్షిస్తున్న సంగతి తెలిసిందే. ఇకపై సిబ్బంది ప్రయాణికులతో 'ఓవర్ ఫ్రెండ్లీ'గా ఉండరాదని వారికి ఆదేశాలు జారీ అయ్యాయి.

వాస్తవానికి ఎవరైనా సెలబ్రిటీలు కనిపించినా, ముద్దులొలికే చిన్నారులు తమ ముందుకు వచ్చినా, వారిని చూసి, చిరునవ్వు నవ్వే సిబ్బందే అధికంగా కనిపిస్తుంటారు. ఇకపై సెక్యూరిటీ సిబ్బంది అలా ఉండరాదని అడిషనల్ డీజీ, ఏవియేషన్ సెక్యూరిటీ చీఫ్ ఎంఏ గణపతి ఈ ఆదేశాలు జారీ చేశారు. ప్రయాణికుల భద్రత మరింత కట్టుదిట్టంగా ఉందన్న సంకేతాలు ప్రజల్లోకి వెళ్లేలా చూసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన అన్నారు. భారత విమానయాన రంగంలో భద్రతపై రెండు రోజుల సెమినార్ ప్రారంభం కాగా, ప్రసంగించిన గణపతి, ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు.

పాసింజర్ ఫ్రెండ్లీ ఫీచర్ ను తొలగించాలని, వారితో మరింత చనువుగా ఇకపై సెక్యూరిటీ సిబ్బంది ఉండబోరని సీఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ రాజేష్ రంజన్ సైతం వ్యాఖ్యానించారు. ఓ చిరునవ్వు మంచిదే అయినా, తమ విధుల పట్ల ఏ మాత్రం అశ్రద్ధగా లేమన్న సంకేతాలు ప్రజల్లోకి వెళ్లాల్సి వుందని ఆయన అభిప్రాయపడ్డారు.

More Telugu News