Train: ఎరుపు రంగు దుస్తుల్లో 'శాతవాహన' ఎక్స్ ప్రెస్ ఎదురుగా యువతి... సినీ పక్కీలో బతికిపోయింది!

  • అప్పుడే స్టేషన్ దాటి వస్తున్న రైలు
  • ఎరుపు దుస్తులను చూసి రైలును ఆపేసిన డ్రైవర్
  • ఆపై కుటుంబీలకు అప్పగింత

కుటుంబ కలహాల నేపథ్యంలో ఆ యువతి తనువు చాలించాలని భావించింది. మహబూబాబాద్ జిల్లా కే సముద్రం సమీపంలో శాతవాహనా ఎక్స్ ప్రెస్ వస్తున్న వేళ, రైలు పట్టాలపై నిలబడింది. ఎదురుగా వస్తున్న రైలు ఆమె వద్దకు వచ్చి ఆగిపోయింది. ఇంతలో చుట్టు పక్కల ఉన్నవారు ఆమెను బలవంతంగా పట్టాలపై నుంచి లాగేశారు. ఇదేదో సినిమా సీన్ లా కనిపిస్తోంది కదా? ఆమె ఎరుపు రంగు పంజాబీ డ్రస్ ను వేసుకుని ఉండటమే ఆమె ప్రాణాలను కాపాడింది. ఆమె దుస్తులను దూరం నుంచే స్పష్టంగా చూసిన డ్రైవర్ బ్రేకులు వేసి, రైలును ఆపాడు.

మరిన్ని వివరాల్లోకి వెళితే, కేసముద్రం ఎర్రగడ్డ కాలనీకి చెందిన 20 ఏళ్ల యువతి ఇంట్లో గత కొన్నేళ్లుగా వివాదాలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్న ఆమె, పెద్దాయి చెరువు వద్ద ఉన్న పట్టాల దగ్గరికి వెళ్లింది. ముందుగా ఏ రైలు వస్తే ఆ రైలు కింద పడాలని భావించింది. ఆ సమయంలో విజయవాడ నుంచి సికింద్రాబాద్ వస్తున్న శాతవాహన కనిపించింది. దానికి ఎదురుగా వెళ్లిన యువతి, మరణానికి సిద్ధపడింది. అప్పుడే స్టేషన్ దాటి వస్తున్న రైలు వేగం తక్కువగా ఉండటంతో, ఆమెను చూసిన డ్రైవర్ రైలును ఆపేశాడు. ఆపై ఆమెను సముదాయించి, కుటుంబీకులకు అప్పగించారు. ఈ ఘటనతో రైలు 5 నిమిషాలు ఆగిపోయింది.

More Telugu News