Amit shah: మన ఉద్యోగాలను వారు లాగేసుకుంటున్నారు.. అక్రమ వలసదారులపై అమిత్ షా

  • అక్రమ వలసదారులకు ప్రతిపక్షాలు వత్తాసు పలుకుతున్నాయి
  • రాహుల్ బాబా పగటి కలలు మానుకోవాలి
  • మళ్లీ అధికారంలోకి వస్తే అక్రమ చొరబాటుదారులను బయటకు పంపేస్తాం

దేశంలోకి అక్రమంగా చొరబడుతున్న వారు ఇక్కడి యువతకు చెందాల్సిన ఉద్యోగాలను లాగేసుకుంటున్నారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పేర్కొన్నారు. కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ, ఇతర ప్రతిపక్ష పార్టీలు ఇటువంటి వారికి వత్తాసు పలుకుతున్నాయని ఆరోపించారు. మధ్యప్రదేశ్‌లోని శివపురిలోని పోలో గ్రౌండ్స్‌లో బీజేపీ కార్యకర్తలతో జరిగిన సమావేశంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. 2018, 2019 ఎన్నికల్లో గెలిచాక ఇటువంటి అక్రమ చొరబాటుదారులను బీజేపీ ప్రభుత్వాలు గుర్తించి దేశం నుంచి బయటకు పంపిస్తాయన్నారు. వచ్చే ఎన్నికల తర్వాత అధికారంలోకి వస్తామన్న ‘పగటి కలలు’ కనడాన్ని రాహుల్ ఆపేస్తే మంచిదని హితవు పలికారు.

దేశ భద్రతకు బీజేపీ కట్టుబడి ఉందని, నేషనల్ రిజస్టర్ ఆఫ్ సిటిజెన్స్ (ఎన్ఆర్‌సీ)ని ప్రస్తావిస్తూ ఇందులో గుర్తించిన 40 లక్షలమంది అక్రమ చొరబాటుదారులను దేశం నుంచి పంపించివేస్తామన్నారు. బీజేపీ చేస్తున్న ఈ ప్రయత్నాలపై రాహుల్ బాబా, ఎస్పీ, బీఎస్పీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు మొసలి కన్నీరు కారుస్తున్నాయని దుయ్యబట్టారు. అక్రమ వలసదారుల వల్ల స్థానికులు తమ ఉద్యోగాలను కోల్పోతున్నారని అమిత్ షా పేర్కొన్నారు.

‘‘వీరు మన యువత ఉద్యోగాలను లాగేసుకుంటున్నారు. ప్రతిపక్ష పార్టీలకు ఇది కనిపించడం లేదు. ఈ ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలతోపాటు వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో గెలిచాక అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతాం’’ అని అమిత్ షా హెచ్చరించారు.

More Telugu News