Dasara: అటు బ్రహ్మోత్సవాలు, ఇటు నవరాత్రి ఉత్సవాలు... తెలుగు రాష్ట్రాల్లో మొదలైన పండగ సందడి!

  • నేటి నుంచి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు
  • తిరుమలలో బ్రహ్మోత్సవాలు
  • స్వగ్రామాలకు వెళ్లే ప్రజలతో బస్టాండ్లు కిటకిట

బతుకమ్మ పండగ మొదలైపోయింది. స్కూలు పిల్లలకు సెలవులు వచ్చేశాయి. ఓ వైపు దసరా నవరాత్రులు, మరోవైపు తిరుమల శ్రీ వెంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలు ప్రారంభం కావడంతో, తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా సందడే కనిపిస్తోంది. ఆలయాలు కిటకిటలాడుతున్నాయి.

తిరుమలలో నేటి నుంచి 9 రోజుల పాటు శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. ఈ ఉదయం ధ్వజారోహణం జరుగగా, సాయంత్రం పెద్దశేష వాహనంపై స్వామివారు తిరుమాఢ వీధుల్లో ఊరేగనున్నారు. రేపు ఉదయం చిన్న శేష వాహనం, రాత్రి హంసవాహన సేవలు జరుగనున్నాయి.

12న ఉదయం సింహ వాహనం, రాత్రికి ముత్యపు పందిరి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చే దేవదేవుడు, 13న ఉదయం కల్పవృక్ష వాహనం, రాత్రికి సర్వభూపాల వాహనంపై ఊరేగనున్నారు. బ్రహ్మోత్సవాల్లో అత్యంత  కీలకమైన గరుడోత్సవం 14న రాత్రికి జరుగనుంది. 15న హనుమంత వాహనం, పుష్పపల్లకి, గజవాహన సేవలు, 16న సూర్యప్రభ, చంద్రప్రభ వాహన సేవలు, 17న స్వర్ణ రథం, అశ్వవాహన సేవల తరువాత 18న చక్రస్నానంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. బ్రహ్మోత్సవాలకు 3 వేల మందితో భద్రతా ఏర్పాట్లు చేసినట్టు ఇప్పటికే టీటీడీ ప్రకటించింది.

ఇక ఇంద్రకీలాద్రి, శ్రీశైలం, శ్రీకాళహస్తి సహా అన్ని శైవ క్షేత్రాల్లో దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. బుధవారం తెల్లవారుజామునుంచే కనకదుర్గమ్మకు ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి. నేడు అమ్మవారు  స్వర్ణకవచాలంకృత కనకదుర్గాదేవిగా దర్శనమివ్వనున్నారు. రాత్రి 11 గంటల వరకూ అమ్మవారి దర్శన భాగ్యాన్ని భక్తులకు కల్పిస్తామని అధికారులు తెలిపారు. ఈ ఉత్సవాలు జరిగే 9 రోజులూ నిత్యమూ లక్ష కుంకుమార్చన, చండీయాగాలు జరుగుతాయని, రెండుపూటలా అన్న ప్రసాద వితరణ ఉంటుందని అధికారులు తెలిపారు.

11న అమ్మవారు బాలా త్రిపుర సుందరిగా, 12న గాయత్రీ దేవిగా, 13న లలితా త్రిపుర సుందరీ దేవిగా, 14న మూలా నక్షత్రం నాడు సరస్వతీ దేవిగా, 15న అన్నపూర్ణగా, 16న మహాలక్ష్మిగా, 17న దుర్గాదేవిగా, 18న మహిషాసురమర్ధనిగా, రాజరాజేశ్వరిగా అమ్మవారు దర్శనమివ్వనున్నారు.

ఇక దసరా ఉత్సవాల నిమిత్తం తమతమ స్వగ్రామాలకు వెళ్లే ప్రయాణికులతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోయాయి. తెలంగాణ, ఏపీ ఆర్టీసీ సంస్థలు ప్రత్యేక బస్సులను నడుపుతున్నాయి.

More Telugu News