supari gang: సుపారీ గ్యాంగ్‌ డబుల్‌ గేమ్‌.. అడ్డంగా బుక్కయిన వైనం!

  • బాధితుడి నుంచి రూ.1.2 లక్షల వసూలు
  • డీల్‌ కుదుర్చుకున్న వ్యక్తితో కలిసి మరోసారి డబ్బులకు ఒత్తిడి
  • వల వేసి పట్టుకున్న పోలీసులు

 ఒక్క డీల్‌కు రెండు సుపారీలనుకున్నారో ఏమో... ఎవరినైతే లేపేయడానికి సుపారీ తీసుకున్నారో ఆ వ్యక్తినే చంపేస్తామని బెదిరించి డబ్బులు డిమాండ్‌ చేసి డబుల్‌ గేమ్‌కు తెరలేపిందో గ్యాంగ్‌. శంషాబాద్‌ ఎస్‌ఓటీ దర్యాప్తులో బట్టబయలైన ఈ వ్యవహారం తెలుసుకుని పోలీసులే నోరు వెళ్లబెట్టారు.

డీసీపీ దయానంద్‌రెడ్డి కథనం మేరకు... మైలార్‌దేవ్‌పల్లి కింగ్స్‌ కాలనీకి చెందిన సయ్యద్‌ బషీరుద్దీన్‌ ఓ చిరు వ్యాపారి.  ఇతనికి అదే ప్రాంతం ఒవైసీ హిల్స్‌కు చెందిన ఎండీ కామిల్‌ (26) స్నేహితుడు. బషీరుద్దీన్‌ వద్ద డబ్బున్న విషయం తెలుసుకున్న కామిల్‌ వాటిని కాజేసేందుకు పథక రచన చేశాడు. ఫలక్‌నుమా సంజయ్‌గాంధీనగర్‌కు చెందిన షేక్‌ ఇమ్రాన్‌ (27), కాలాపత్తర్‌ అషుర్‌ఖానాకు చెందిన షేక్‌ ఒబేద్‌ అనే రౌడీషీటర్లతో బషీరుద్దీన్ ని హత్య చేయడానికి డీల్‌ కుదుర్చుకున్నాడు.

అనంతరం బషీరుద్దీన్‌ కదలికలన్నీ రౌడీషీటర్లకు చెబుతుండేవాడు. వీరు బషీరుద్దీన్‌ను ఫోన్‌లో బెదిరిస్తుండేవారు. డబ్బులివ్వకపోతే చంపేస్తామంటూ బ్లాక్ మెయిల్ చేశారు. తన కదలికలన్నీ అచ్చుగుద్దినట్లు రౌడీషీటర్లు చెబుతుండడంతో భయపడిన బషీరుద్దీన్‌ ఇమ్రాన్‌, ఒబేద్‌ డిమాండ్‌ చేసిన 1.2 లక్షల రూపాయలు వారు తెచ్చిమ్మన్న చోటికి తీసుకువెళ్లి ఇచ్చేశాడు. అనంతరం ఓ కేసులో ఒబేద్‌ను పోలీసులు జైలుకు పంపగా, ఈసారి ఇమ్రాన్‌, కామిల్‌లు బషీరుద్దీన్‌ను డబ్బు కోసం బెదిరించడం మొదలు పెట్టారు. బాధితుడు ఎస్‌ఓటీ పోలీసులను ఆశ్రయించడంతో ఈ గుట్టు రట్టయింది.

More Telugu News