Supreme Court: రాఫెల్ ఒప్పందంపై అక్టోబర్ 10న సుప్రీంకోర్టు కీలక విచారణ

  • ఓ న్యాయవాది దాఖలు చేసిన పిల్ పై విచారణ
  • రాఫెల్ డీల్ పై విచారణ జరపనున్న ప్రధానన్యాయమూర్తి సారధ్యంలోని బెంచ్
  • నిబంధనలకు విరుద్ధమంటూ దాఖలైన మరో పిటీషన్ పై కూడా

భారత్, ఫ్రాన్స్ మధ్య కుదిరిన ‘రాఫెల్ యుద్ధ విమానాల’ ఒప్పందంలో అవకతవకలు జరిగాయనే ఆరోపణల నేపథ్యంలో సుప్రీంకోర్టులో దాఖలైన పిల్ పై అక్టోబర్ 10న విచారణ జరగనుంది. వినీత్ దండ అనే న్యాయవాది దాఖలు చేసిన పిల్ పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, న్యాయమూర్తులు జస్టిస్ ఎస్ కే కౌల్, జస్టిస్ కే ఎం జోసెఫ్ మోండేల బెంచ్ వాదనలు విననుంది. రాఫెల్ ఒప్పందం వివరాలతో పాటుగా, యూపీఏ, ఎన్ డీఏ ప్రభుత్వాల హయాంలో ఈ ఒప్పందపు విలువలో వున్న వ్యత్యాసాన్ని సీల్డ్ కవర్లో సుప్రీంకోర్టుకు సమర్పించాల్సిందిగా కేంద్రాన్ని ఆదేశించాలని న్యాయవాది తన పిల్ లో కోరారు.

ఇదిలావుండగా భారత్, ఫ్రాన్స్ మధ్య జరిగిన ఒప్పందంపై స్టే విధించాలంటూ ఎం ఎల్ శర్మ అనే అడ్వకేట్ వేసిన పిటీషన్ కూడా ఈ నెల 10న విచారణకు రానుంది. 36 విమానాల కొనుగోలు ఒప్పందంలో అవినీతి జరిగిందని, ఇరు దేశ ప్రభుత్వాల మధ్య జరిగిన ఒప్పందానికి రాజ్యాంగంలోని ఆర్టికల్ 253 ప్రకారం పార్లమెంట్ ఆమోదం లేనందున, ఒప్పందాన్ని రద్దు చేయాలని న్యాయవాది శర్మ తన పిటీషన్ లో పేర్కొన్నారు.

ఇదేకోవలో రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందంలో అవినీతిపై స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించి వివరాలను పార్లమెంటుకు సమర్పించాలని కోరుతూ సుప్రీంలో మార్చి నెలలో మరో పిటీషన్ దాఖలైంది. నిబంధనల ప్రకారం డిఫెన్స్ ప్రొక్యూర్ మెంట్ ప్రొసీజర్(బీపీపీ) అనుమతి కోరలేదని, ఫ్రాన్స్ తో జరిగిన ఒప్పందానికి కేంద్ర కేబినెట్ ఆమోదం ఎందుకు తీసుకోలేదో కేంద్రం నుంచి తెలుసుకోవాలని కోరుతూ కాంగ్రెస్ నేత తెహ్ సీన్ ఎస్ పూనావల్లా కూడా ఓ పిటీషన్ ను సుప్రీం కోర్టులో దాఖలు చేశారు.

రాఫెల్ ఒప్పందం భారత్, ఫ్రాన్స్ మధ్య జరిగిన రక్షణ ఒప్పందం. భారత ఎయిర్ ఫోర్స్ ఆయుధాల ఆధునికీకరణ ప్రక్రియలో భాగంగా భారత్, ఫ్రాన్స్ మధ్య జరిగిన ఈ ఒప్పందంలో 36 రాఫెల్ యుద్ధ విమానాలు భారత్ కొనుగోలు చేయాలనేదే ఒప్పందం. రెండు ఇంజిన్ల మీడియం మల్టీ రోల్ కంబాట్ సామర్థ్యం కలిగిన రాఫెల్ విమానాలను ఫ్రెంచ్ ఏరోస్పెస్ కంపెనీ డసాల్డ్ ఏవియేషన్ తయారు చేసింది. 126 యుద్ధ విమానాల కొనుగోలుకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ 2007 ఆగస్టులో ప్రతిపాదనలు చేసింది.  

More Telugu News