Chandrababu: లోటు వర్షపాతంలోనూ మేటి ఫలితాలు... సమర్థ నీటి వినియోగమే కారణం: చంద్రబాబు

  • మూడేళ్లుగా వర్షాభావ పరిస్థితులు
  • సగటున 24 శాతం తక్కువ  వర్షపాతం నమోదు
  • అయినా దిగుబడులు ఆశాజనకంగా ఉండడం మన పనితీరుకు నిదర్శనం

‘గడచిన మూడేళ్లుగా రాష్ట్రం లోటు వర్షపాతాన్ని ఎదుర్కొంటోంది. దాదాపు 24 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. అయినా వ్యవసాయ రంగంలో మేలైన ఫలితాలను సాధించగలిగాం. మంచి దిగుబడులు సాధించగలిగాం. సమర్థ నీటి వినియోగం వల్లే ఇది సాధ్యమైంది’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. సోమవారం సీఎం ‘నీరు-ప్రగతి, వ్యవసాయం’పై అధికారులతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

ఈ సందర్భంగా  మాట్లాడుతూ భూగర్భ, ఉపరితల జలాలను సమర్థవంతంగా వినియోగించగలిగినప్పుడు ప్రకృతి ఇబ్బందులను ఎదుర్కోగలమన్నారు. వరి దిగుబడుల్లో ఈ ఏడాది ఆశాజనకమైన ఫలితాలు ఆశిస్తున్నామని చెప్పారు. లోటు వర్షపాతంలోనూ గండికోట జలాశయంలో 12.5 టీఎంసీల నీటిని నిల్వ చేయగలిగామని చెబుతూ, వచ్చే ఏడాది 20 టీఎంసీలు నిల్వ చేయాలని అధికారులను ఆదేశించారు. వర్షాభావ పరిస్థితుల్లోనూ చెరువులన్నీ నీటితో కళకళలాడేలా చేయగలిగామని చెప్పారు.

 ఆర్థిక, మానవ వనరులను గరిష్ట స్థాయిలో వినియోగించడం ద్వారా  వృద్ధి రేటును 10.5 శాతం నుంచి 15 శాతానికి తీసుకు వెళ్లాలని సూచించారు. ప్రతి శాఖలో వినూత్న విధానాలు రూపొందించామని, అనుకున్న ఫలితాలు సాధించామని, ఈ స్ఫూర్తిని ఇదే స్థాయిలో కొనసాగించాలని సూచించారు. ‘అభివృద్ధి అనేది నిరంతర ప్రవాహం లాంటిది. దానికి ఎట్టి పరిస్థితుల్లోనూ బ్రేక్‌ పడకూడదు. ఆశావాద దృక్ఫథంతో ముందుకు సాగగలిగితే అనుకున్న ఫలితాలు సాధ్యమవుతాయి’ అని సీఎం అధికారులకు దిశానిర్దేశం చేశారు.

More Telugu News