బ్లూంబర్గ్ న్యూ ఎకానమీ ఫోరం నుంచి కేటీఆర్ కు ఆహ్వానం

07-10-2018 Sun 21:03
  • వచ్చే నెల 6, 7 తేదీల్లో సింగపూర్ లో సదస్సు
  • పలు అంశాలపై ప్రసంగించనున్న కేటీఆర్
  • ఈ ఆహ్వానంపై కేటీఆర్ సంతోషం  
తెలంగాణ మంత్రి కేటీఆర్ కు మరో అరుదైన గౌరవం దక్కింది. బ్లూంబర్గ్ న్యూ ఎకానమీ ఫోరం నుంచి ఆయనకు ఆహ్వానం అందింది. వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థల మార్పులను చర్చించే నిమిత్తం నూతనంగా ఏర్పాటు చేయనున్న ఈ ఫోరం ప్రారంభోత్సవానికి వ్యవస్థాపక ప్రతినిధిగా ఉండాలంటూ కేటీఆర్ కు ఈ ఆహ్వానం అందింది.

వచ్చే నెల 6, 7 తేదీల్లో సింగపూర్ లో ఈ సదస్సు జరగనుంది. నగరీకరణ, పట్టణ మౌలిక వసతులు, ఐటీ అంశాలపై ఈ సదస్సులో కేటీఆర్ ప్రసంగించనున్నారు. ఎనిమిది దేశాల నుంచి సుమారు మూడు వందల కంపెనీల ముఖ్య కార్య నిర్వాహక అధికారులు, వివిధ దేశాల రాజకీయ నాయకులు, వక్తలు హాజరుకానున్నారు. కాగా, ఈ ఆహ్వానంపై కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు.