Gujarath: గుజరాత్ లో టెన్షన్ టెన్షన్.. ప్రాణ భయంతో పారిపోతున్న బిహార్, ఉత్తరప్రదేశ్ ప్రజలు!

  • మైనర్ అమ్మాయిని రేప్ చేసిన బిహార్ యువకుడు
  • బిహార్, యూపీ ప్రజలు లక్ష్యంగా మొదలైన దాడులు
  • ప్రాణభయంతో వణికిపోతున్న వలస ప్రజలు

ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్ లో ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఓ గుజరాతీ అమ్మాయి(14)పై అత్యాచారం కేసులో బిహార్ నుంచి వలసవచ్చిన వ్యక్తిని అరెస్ట్ చేయడంతో అల్లరిమూకలు రెచ్చిపోయాయి. బిహార్, ఉత్తరప్రదేశ్ నుంచి వలసవచ్చిన కుటుంబాలే లక్ష్యంగా దాడులకు తెగబడ్డాయి. సోషల్ మీడియాలో కొందరు విద్వేష పూరిత పోస్టులు చేయడంతో గాంధీనగర్, అహ్మదాబాద్, పటన్, సబర్‌కాంతా, మెహసానా ప్రాంతాల్లో వలసవచ్చిన వారిపై అల్లరిమూకలు విరుచుకుపడ్డాయి. దీంతో ప్రాణాలను అరచేత పట్టుకుని పలువురు సొంత రాష్ట్రాలకు పారిపోతున్నారు.

అహ్మదాబాద్‌కు 100 కిలోమీటర్ల దూరంలోని సబర్‌కాంతా జిల్లా హిమ్మత్‌నగర్ టౌన్‌లో సెప్టెంబర్ 28న ఓ బాలిక(14)పై అత్యాచారం జరిగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేేసిన పోలీసులు ఓ బిహార్ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో గుజరాతీ ప్రజల్లో ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. వీటికి ఆజ్యం పోస్తూ సోషల్ మీడియాలో విద్వేష పోస్టులు దర్శనమివ్వసాగాయి.

దీనికి తోడు ఠాకూర్ సేన అనే సంస్థ బిహార్, యూపీ ప్రజలు వెంటనే గుజరాత్ ను వదిలి వెళ్లిపోవాలని వార్నింగ్ ఇచ్చింది. లేదంటే తీవ్ర పర్యవసానాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. వీరికి పని ఇవ్వరాదని దుకాణాల యజమానులకు అల్టిమేటం జారీచేసింది. దీంతో వందలాది మంది ప్రజలు ప్రాణ భయంతో తమ సొంత రాష్ట్రాలకు పారిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ మార్గంలో ప్రయాణించే బస్సులు, రైళ్లు కిటకిటలాడుతున్నాయి.

మరోవైపు ఈ దాడులపై డీజీపీ శివానంద్ ఝూ స్పందిస్తూ.. ఇప్పటివరకూ 170 మంది నిందితులను అరెస్ట్ చేశామని తెలిపారు. ఈ అల్లర్లకు సంబంధించి 18 ఎఫ్ఐఆర్ లను నమోదు చేశామన్నారు. ఇలాంటి దాడులను తాము ఎలాంటి పరిస్థితుల్లోనూ సహించేది లేదని, గుజరాతేతరులు ఎక్కువగా పనిచేస్తున్న ఫ్యాక్టరీలు, హౌసింగ్ సొసైటీల వద్ద కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని స్థానిక పోలీసులకు ఆదేశాలిచ్చినట్లు చెప్పారు. సోషల్ మీడియా మెసేజ్‌లపై కూడా నిఘా ఉంచామన్నారు.

More Telugu News