gitam: ‘గీతం’ మూర్తికి నివాళులర్పించిన వెంకయ్యనాయుడు, చంద్రబాబు

  • అన్ని మంచిగుణాలు మూర్తీభవించిన వ్యక్తి మూర్తి
  • ‘గీతం’ విద్యాసంస్థకు ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చారు
  • విశాఖ జిల్లా పెద్ద దిక్కును కోల్పోయింది

టీడీపీ నేత, ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ మూర్తి పార్థివ దేహానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సీఎం చంద్రబాబునాయుడు, పలువురు మంత్రులు నివాళులర్పించారు. విశాఖపట్టణంలోని నివాసంలో ఉంచిన మూర్తి భౌతికకాయాన్ని ఈరోజు సందర్శించారు. మూర్తి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

అనంతరం, మీడియాతో వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, అన్ని మంచిగుణాలు మూర్తీభవించిన వ్యక్తి మూర్తి అని, వ్యాపారవేత్తగా, విద్యావేత్తగా విజయవంతంగా కార్యక్రమాలు నిర్వహించారని అన్నారు. పదిమందికి ఉపయోగపడేలా ఆయన జీవితాన్ని మలచుకున్నారని, ‘గీతం’ విద్యాసంస్థకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకువచ్చారని, విద్యా సంస్థలను ఉన్నత ప్రమాణాలతో తయారు చేశారని కొనియాడారు.

స్వర్ణభారత్ ట్రస్టు విజయవాడ చాప్టర్ విషయంలోనూ ఆయన తమకు సహకరించిన విషయాన్ని ప్రస్తావించారు. విశాఖ జిల్లా పెద్ద దిక్కును కోల్పోయిందని, ఆయన చేసిన మంచి పనులకు సహకారం అందించడమే మనం అందించే నివాళి అని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని వెంకయ్యనాయుడు అన్నారు.

టీడీపీ పెద్ది దిక్కును కోల్పోయింది

విశాఖపట్టణం అంటే ఎప్పుడూ మూర్తే గుర్తుకు వచ్చేవారని, టీడీపీ, ఎన్టీఆర్ అంటే ఆయనకు ఎనలేని అభిమానమని సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. టీడీపీ పెద్ద దిక్కును కోల్పోయిందని, మూర్తి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నానని అన్నారు.

కాగా, మూర్తి పార్థివదేహానికి నివాళులర్పించిన వారిలో మండలి చైర్మన్ ఫరూక్,
మంత్రులు చినరాజప్ప, యనమల రామకృష్ణుడు, లోకేశ్, దేవినేని ఉమ, ప్రత్తిపాటి పుల్లారావు, అచ్చెన్నాయుడు, టీడీపీ నేతలు సీఎం రమేశ్, వీవీవీ చౌదరి, నన్నపనేని రాజకుమారి, నిర్మాత సురేశ్ బాబు, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, బీజేపీ నేతలు పురందేశ్వరి, విష్ణుకుమార్ రాజు తదితరులు ఉన్నారు.

మూర్తి నివాసం వద్ద నుంచి ఆయన పార్థివదేహాన్ని టీడీపీ కార్యాలయానికి తలించనున్నారు. పార్టీ కార్యాలయం నుంచి రుషికొండలోని గీతం డీమ్డ్ యూనివర్శిటీ వరకు అంతిమయాత్ర నిర్వహిస్తారు. వర్శీటీ సమీపంలో మూర్తి అంతిమ సంస్కారాలు నిర్వహిస్తారు.

More Telugu News