Virat Kohli: ఎలా ఆడాలో అర్థం చేసుకుని మరీ ఇరగదీశారు: కోహ్లీ ప్రశంస

  • ఆటగాళ్లపై కోహ్లీ ప్రశంసల వర్షం
  • వాతావరణానికి చక్కగా అలవాటుపడ్డారు
  • ఆటతీరును మరింత మెరుగుపరుచుకోవాలి

భారత్-విండీస్ మధ్య జరిగిన తొలి టెస్టు మూడు రోజుల్లోనే ముగిసింది. భారత బౌలర్ల విజృంభణతో విండీస్ బ్యాట్స్‌మెన్ కుప్పకూలారు. భారత టెస్టు క్రికెట్ చరిత్రలో ఇదే అతిపెద్ద గెలుపు. అటు విండీస్‌కు రెండో అతిపెద్ద పరాజయం. శనివారం రాజ్‌కోట్‌లో భారత్ చేతిలో ఇన్నింగ్స్ 272 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఈ మ్యాచ్ భారత్‌కు అంతులేని ఆనందాన్నిచ్చింది. టీమిండియా సారధి విరాట్ కోహ్లీ ఆనందానికి అవధుల్లేవు.

మ్యాచ్ అనంతరం కోహ్లీ మాట్లాడుతూ.. ఆటగాళ్లపై ప్రశంసల వర్షం కురిపించాడు. విదేశీ పర్యటన తర్వాత స్వదేశానికి వచ్చిన జట్టు సభ్యులు ఇక్కడి వాతావరణానికి చక్కగా అలవాటు పడ్డారన్నాడు. పరిస్థితులకు అనుగుణంగా ఎలా ఆడాలో కుర్రాళ్లు అర్థం చేసుకున్నారని పేర్కొన్నాడు. బౌలర్లు తమ ప్రతాపాన్ని చూపించారని కొనియాడాడు.

తొలి ఇన్నింగ్స్‌లో రవిచంద్రన్ అశ్విన్, రెండో ఇన్నింగ్స్‌లో కుల్దీప్ యాదవ్ అద్భుతంగా రాణించారని కోహ్లీ కితాబిచ్చాడు. తొలి టెస్టులో అద్భుత ఆటతీరుతో సెంచరీ సాధించిన ఓపెనర్ పృథ్వీ షా, రవీంద్ర జడేజాలపై కోహ్లీ ప్రశంసలు కురిపించాడు. అయితే, ఆటను తాము మరింత మెరుగుపరచుకోవాల్సి ఉందనే అభిప్రాయాన్ని కోహ్లీ వ్యక్తం చేశాడు.

More Telugu News