Diwali: దీపావళి వెలుగుల్లో మెరిసిపోనున్న ‘నయాగరా’

  • అక్టోబర్ 14న దీపావళి వేడుకలు
  • మధ్యాహ్నం వేళ సాంస్కృతిక కార్యక్రమాలు
  • రాత్రివేళ బాణసంచా వెలుగులు
  • 12, 13 తేదీల్లో రామ్‌లీలా ప్రదర్శన

ప్రపంచంలోనే ఎత్తైన జలపాతమే కాదు.. అందమైన జలపాతం కూడా నయాగరానే. పర్యాటకులకు అత్యంత ఇష్టమైన ఈ జలపాతం ఇప్పుడు మరో విశేషాన్ని సొంతం చేసుకోబోతోంది. ఈ జలపాతానికి ముందుగానే దీపావళి రానుంది. మనమంతా నవంబర్ 7న దీపావళి జరుపుకోనుండగా.. నయాగరా జలపాతం మాత్రం అక్టోబర్ 14నే జరుపుకోనుంది. ఆ రోజున అక్కడ అంగరంగ వైభవంగా దీపావళి వేడుకలను నిర్వహించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.

నయాగరా వద్ద దీపావళి వేడుకలు నిర్వహించాలని మోదీ కొన్నేళ్లుగా జరుపుతున్న చర్చలు.. ఇప్పటికి కార్యరూపం దాల్చాయి. మధ్యాహ్నం వేళ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనుండగా.. రాత్రివేళ బాణసంచా వెలుగులతో దీపావళిని జరుపనున్నట్లు ఐసీఏసీ అధ్యక్షుడు అజయ్‌ మోదీ తెలిపారు. ‘అక్టోబరు 14న దీపావళి వేడుకలు నిర్వహించనున్నాం. ఎందుకంటే పండుగ వచ్చే సమయానికి కెనడాలో వాతావరణ పరిస్థితులు పూర్తిగా మారిపోతాయి. అందువల్లే ముందస్తుగా వేడుకలు నిర్వహిస్తున్నాం’ అని అజయ్‌ వెల్లడించారు.

నయాగరా పార్క్స్‌ కమిషన్‌ సహకారంతో ఇండో-కెనడియన్‌ ఆర్ట్స్‌ కౌన్సిల్‌ (ఐసీఏసీ) నయాగరా జలపాతం వద్ద దీపావళి వేడుకలు నిర్వహించనుంది. ఈ వేడుకల్లో విశేషం ఏంటంటే.. ప్రత్యేక అవసరాలు కలిగిన కళాకారులు ప్రదర్శన ఇవ్వనున్నారు. మిస్సిస్వాగా ప్రాంతంలో అక్టోబరు 12, 13 తేదీల్లో రామ్‌లీలాను ప్రదర్శించనున్నారు. ఈ వేడుకలను వీక్షించేందుకు పర్యాటకులు పెద్ద సంఖ్యలో హాజరుకానున్నారు. 

More Telugu News