kcr: నా బండారం ఏముందో దమ్ముంటే దానిని బయటపెట్టు!: కేసీఆర్ కు డీకే అరుణ సవాల్

  • ‘ఆంధ్రోళ్లకు నీళ్లిచ్చింది..’ అంటూ దొంగనాటకాలాడుతున్నాడు 
  • నేను హారతులు పట్టిన ఫొటోను కేసీఆర్ చూపెట్టాలి
  • డీకే అరుణకు హంద్రీనీవాతో ఎలాంటి సంబంధం లేదు

నాడు సమైక్య పాలనలో హంద్రీ నీవా కాల్వ నుంచి నీళ్లు పట్టుకుపోతామని రఘువీరారెడ్డి అంటే, ఆయనకు మంగళహారతులు పట్టిన డీకే అరుణ బండారం, చరిత్ర బయటపెడతామని కేసీఆర్ నిన్న హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో కేసీఆర్ పై డీకే అరుణ నిప్పులు చెరిగారు. ఈరోజు ఆమె విలేకరులతో మాట్లాడుతూ, ‘ఎలాంటి మచ్చలేని, ప్రజాదరణ ఉన్న నాయకురాలు, ప్రజా సేవలో అంకితమై పని చేసే నాయకురాలు డీకే అరుణ. కనుక నన్ను విమర్శించలేక.. ‘హంద్రీనీవా..హంద్రీ నీవా’ అని మాట్లాడుతున్నారు.

నేను హారతులు పట్టినటువంటి ఫొటోను కేసీఆర్ ను చూపెట్టమనండి. పోయిన ఎన్నికల్లో కూడా ఇదే డైలాగ్ చెప్పాడు. గద్వాల బిడ్డలకు గానీ, పాలమూరు జిల్లాకు గానీ నా శక్తికి మించి శ్రమను పెట్టాను. కేసీఆర్ చెబుతున్న మాటలు పచ్చి అబద్ధం. ‘ఆంధ్రోళ్లకు నీళ్లిచ్చింది..’ అంటూ దొంగనాటకాలాడుతున్నాడు.

డీకే అరుణ మీద ఎలాంటి మచ్చ లేదు. డీకే అరుణ హంద్రీనీవాకు నిధులు కేటాయించిందీ లేదు.. ప్రాజెక్టు కట్టించిందీ లేదు. ఇవన్నీ ఈయన ఆడుతున్న దొంగనాటకాలు. డీకే అరుణకు హంద్రీనీవాతో ఎలాంటి సంబంధం లేదు. డీకే అరుణపై ఎప్పుడు విమర్శ చేసినా ఈ డైలాగ్ తప్ప ఇంకో మాట రాదు వాళ్లకు. వాళ్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా నా డెడికేషన్ ఏంటో ప్రజలకు తెలుసు. కేసీఆర్ లాగా దొంగ మాటలు, దొంగ హామీలు.. ప్రజలను మోసం చేసే హామీలు నేను చెప్పలేదు. ఆయన చేసిన ఆరోపణల్లో నిజం లేదు’ అని స్పష్టం చేశారు.

‘నా బండారం బయట పెడతా..బయటపెడతా అనడం ఎందుకు? బయటపెట్టొచ్చు కదా? నా బండారం ఆయన దగ్గర ఏముందో దమ్ముంటే బయటపెట్టమను. ఆడపడుచులను గౌరవించడం చేతకాని కుసంస్కారి.. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండటం తెలంగాణకే సిగ్గు చేటు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉండీ విర్రవీగితే.. తెలంగాణ ప్రజలు కర్రు కాల్చి వీపు మీద వాతలు పెడతారు.

తెలంగాణ ఉద్యమంలో నిన్న తన్నితన్ని తరిమికొడతామన్న వాళ్లను ఈరోజున చంకనపెట్టుకుని.. ఆ పక్కా ఈ పక్కా కుర్చీలేసుకుని కూర్చోబెట్టుకున్నావే.. నీకు లేని సిగ్గు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు? ఈరోజున ఆయనకు భయం పట్టుకుంది. ఓడిపోతామనుకునే భయంలో ఉండి, అది తట్టుకోలేక కాంగ్రెస్ పార్టీ పైనా, మాపైనా, టీడీపీపైన, చంద్రబాబునాయుడు పైనా వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. కేవలం, ఓటమి భయంతో చేస్తున్న విమర్శలివి’ అని డీకే అరుణ నిప్పులు చెరిగారు. 

More Telugu News