bjp: డిసెంబర్ 7న జరిగే ఎన్నికలకు బీజేపీ సిద్ధంగా ఉంది: లక్ష్మణ్

  • ప్రజాబలమున్న గెలుపు గుర్రాలే మా అభ్యర్థులు 
  • నవంబర్ 12 లోగా విడతల వారీగా అభ్యర్థుల ప్రకటన
  • ఈ నెల 10న ‘కరీంనగర్ సమరభేరి’ 

రాష్ట్రంలో డిసెంబర్ 7న జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు తమ పార్టీ సిద్ధంగా ఉందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రజాబలం ఉన్న గెలుపు గుర్రాలనే తమ అభ్యర్థులుగా ప్రకటిస్తామని, నవంబర్ 12 లోగా విడతల వారీగా తమ అభ్యర్థులను ప్రకటించడం జరుగుతుందని చెప్పారు.

ఈ నెల 10న ‘కరీంనగర్ సమరభేరి’ నిర్వహించనున్నామని, ఈ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా హాజరవుతారని తెలిపారు. అదేవిధంగా, ఈ నెల 27, 28 తేదీల్లో జాతీయ యువమోర్చా సమావేశాలు కూడా నిర్వహించనున్నట్టు చెప్పారు.

కేసీఆర్ ప్రసంగాలతో ఆయనలోని నైరాశ్యం అర్థమవుతోంది

సీఎం కేసీఆర్, కాంగ్రెస్ పార్టీ లపై లక్ష్మణ్ విమర్శలు గుప్పించారు. కేసీఆర్ రాచరిక పాలన, కాంగ్రెస్ అవకాశవాద రాజకీయాలను ఎండగడతామని అన్నారు. ఉత్తమ్, కేసీఆర్ పరుష పదజాలంతో మాట్లాడుతున్నారని, కేసీఆర్ ప్రసంగాలు చూస్తుంటే ఆయనలోని నైరాశ్యం అర్థమవుతోందని అన్నారు.

మహాకూటమి పేరిట విరుద్ధమైన పార్టీలు పొత్తు పెట్టుకున్నాయని, ఇది మహాకూటమి కాదని తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని తాకట్టుపెట్టే కూటమని విమర్శించారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ ల హయాంలోనే పులిచింతల, పోతిరెడ్డిపాడు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు జరిగాయని, వీటి గురించి మాట్లాడటం ఎవరిని మోసం చేయడానికని ప్రశ్నించారు.

బీజేపీ లేకపోతే మలిదశ తెలంగాణ ఉద్యమమే లేదని, సుష్మా స్వరాజ్ నాడు పార్లమెంట్ లో తెలంగాణ వాదనను గట్టిగా వినిపించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. కాంగ్రెస్ పార్టీ మునిగిపోయిన పడవ అయితే, టీఆర్ఎస్ మునిగిపోయే పడవ అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 

More Telugu News