TTD: శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆర్జిత సేవలన్నీ రద్దు : టీటీడీ ఈఓ సింఘాల్‌

  • వృద్ధులు, వికలాంగులు, పిల్లల ప్రత్యేక దర్శనాలు ఉండవు
  • 10 నుంచి 18వ తేదీ వరకు వైభవంగా  ఉత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు
  • అధిక మాసం కారణంగా ఈ ఏడాది రెండు సార్లు

అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు, కలియుగదైవం శ్రీవేంకటేశ్వరస్వామి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు తిరుమల ముస్తాబవుతోంది. అధిక మాసం కారణంగా ఈ ఏడాది రెండుసార్లు ఉత్సవాలు జరగనున్నాయి. ఉత్సవాల సందర్భంగా ఆర్జిత సేవలన్నీ రద్దు చేస్తున్నామని, వయో వృద్ధులు, దివ్యాంగులు, చంటిబిడ్డల ప్రత్యేక దర్శనాలూ ఉండవని టీటీడీ ఈఓ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ తెలిపారు. సిఫార్సు లేఖలు కూడా స్వీకరించమని స్పష్టం చేశారు.

సెప్టెంబరులో పాలకట్ల ఉత్సవం పూర్తిచేశామని, ఈనెల 10 నుంచి 18వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తామని చెప్పారు. ఉత్సవాల్లో భాగంగా దేశవ్యాప్తంగా పేరొందిన కళాబృందాలను రప్పిస్తున్నట్లు తెలిపారు. ఆన్‌లైన్‌ డిప్‌ విధానంలో అక్రమాలు బయటపడినందున ఇకపై ఈమెయిల్‌ ఐడీ, మొబైల్‌ నంబర్‌ ఆధారంగా ఒకరు ఒక టికెట్టు మాత్రమే బుక్‌ చేసుకునేలా మార్పులు చేస్తున్నట్లు తెలిపారు. తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆర్జిత సేవా టికెట్లను 50 శాతం ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతున్నామని, వీటిని 90 నుంచి 48 గంటల ముందుగా బుక్‌ చేసుకోవచ్చని తెలిపారు.

More Telugu News