Hyderabad: బస్సులో పరిచయమైన అమ్మాయిని ప్రేమలోకి దింపి మోసం .. కటకటాల వెనక్కి నెట్టిన పోలీసులు!

  • హైదరాబాద్, ఎల్బీ నగర్ లో ఘటన
  • ఫిజియో థెరపిస్టుకు మాయమాటలు చెప్పిన యువకుడు
  • లోబరచుకుని, మరో పెళ్లి చేసుకున్న వైనం

బస్సులో పరిచయమైన యువతికి మాయమాటలు చెప్పి మోసం చేసినందుకు ఓ యువకుడిని కటకటాల వెనక్కు పంపారు హైదరాబాద్ పోలీసులు. మరిన్ని వివరాల్లోకి వెళితే, ఎల్బీ నగర్ సమీపంలోని మన్సారాబాద్, సౌత్ ఎండ్ పార్క్ కాలనీలో నివాసం ఉంటున్న ఓ యువకుడు, ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. అతను బస్సులో వెళుతుంటే, ఫిజియో థెరపిస్టుగా పనిచేస్తున్న యువతి (25) పరిచయం అయింది.

 ఆ పరిచయాన్ని పెంచుకున్న అతను, ప్రేమిస్తున్నానని మాయమాటలు చెప్పాడు. ఆమెకు ఓ గది అద్దెకు కావాల్సి వస్తే, తమ ఇంట్లోని గదిని అద్దెకు ఇచ్చేలా చేశాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెను లోబరచుకున్నాడు. తర్వాత ఈమెకు తెలియకుండా మరో వివాహం చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న బాధితురాలు పోలీసులను ఆశ్రయించగా, వారు అతన్ని అరెస్ట్ చేసి రిమాండుకు పంపారు.

More Telugu News