apple: జిత్తులమారి చైనా.. రహస్య మైక్రోచిప్ లు అమర్చి యాపిల్, అమెజాన్ లో భారీగా సమాచారం చోరీ!

  • అమెరికా రక్షణ రహస్యాలను తస్కరించిన చైనా
  • 2015లో గుర్తించిన అమెరికా
  • ఖండించిన యాపిల్, అమెజాన్

అమెరికా భద్రతా వ్యవస్థలపై చైనా సైబర్ దాడికి పాల్పడుతోందని ఇటీవలి కాలంలో అగ్రరాజ్యం ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి తోడు ఇరు దేశాల మధ్య నెలకొన్న వాణిజ్య యుద్ధంతో పరిస్థితి మరింత దిగజారింది. తాజాగా చైనాకు సంబంధించి బ్లూమ్స్ బర్గ్ బిజినెస్ వీక్ సంచలన విషయం బయటపెట్టింది. అమెజాన్, యాపిల్ కంపెనీ సర్వర్లలో చైనా రహస్యంగా మైక్రోచిప్ లను అమర్చిందని బాంబు పేల్చింది. వీటిని వాడిన కంపెనీల రహస్య సమాచారాన్ని కమ్యూనిస్టు దేశం తస్కరించిందని వెల్లడించింది. చైనా పంజాలో అమెరికా సైన్యం సైతం చిక్కుకుందని పేర్కొంది.

చైనాలో ఈ కంప్యూటర్ సర్వర్లు తయారు అయ్యాయనీ, వీటి అసెంబ్లింగ్ సందర్భంగా రహస్య మైక్రో చిప్ లను అమర్చారని బ్లూమ్స్ బర్గ్ సంస్థ నివేదికలో తెలిపింది. ఈ సర్వర్లను అమెరికా రక్షణ శాఖ వాడుతోందన్న సంచలన విషయాన్ని బయటపెట్టింది. దీని వల్ల అమెరికా రహస్య ఆయుధ కేంద్రాలు, కొత్త సాంకేతికత-ఆయుధాల బ్లూప్రింట్లు, డ్రోన్లు, సీఐఏ ఆపరేషన్లు, యుద్ధ నౌకలు సహా కీలక రహస్యాలు చైనా చేతికి వెళ్లిపోయి ఉంటాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఘటనపై అమెరికా ప్రభుత్వం విచారణకు ఇప్పటికే ఆదేశించిందని వెల్లడించింది. అమెరికా సైన్యం, ప్రభుత్వంలోని 17 మంది ఉన్నతాధికారులను సంప్రదించిన అనంతరం బ్లూమ్స్ బర్గ్ ఈ నివేదికను విడుదల చేసింది. కాగా, ఈ విషయమై స్పందించేందుకు అమెరికా నిఘా వర్గాలు నిరాకరించాయి.

అమెరికాలోని శాన్ జోస్ లో ఉన్న సూపర్ మైక్రో అనే కంపెనీ.. కంప్యూటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల్లో మదర్ బోర్డులను తయారుచేస్తుంది. అయితే వీటి అసెంబ్లింగ్ ను మాత్రం చైనాలో చేపడుతోంది. దీన్ని ఆసరాగా చేసుకున్న చైనా నిఘా వర్గాలు రహస్యంగా నిఘా పెట్టేందుకు మైక్రో చిప్ లను జోడించినట్లు సమాచారం. 2015లో ఈ రహస్య సర్వర్లను గుర్తించిన యాపిల్, అమెజాన్.. వాటిని తొలగించేందుకు చర్యలు మొదలుపెట్టాయి. ఇది కేవలం వీటికే పరిమితమయిందా లేక మిగతా కంప్యూటర్లు అన్నింటిలోనూ చైనా జొప్పించిందా? అన్న విషయాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. కాగా, బ్లూమ్స్ బర్గ్ నివేదికను యాపిల్, అమెజాన్ ఖండించాయి.

More Telugu News