punjab: లూథియానాలోని పకోడా షాపుపై ఐటీ శాఖ దాడులు!

  • ఆదాయాన్ని తక్కువ చేసి చూపారని ఆరోపణ
  • పక్కా సమాచారంతో అధికారుల తనిఖీలు
  • స్పందించేందుకు నిరాకరించిన ఇరువర్గాలు

కొన్నిరోజుల క్రితం ప్రధాని మోదీ మాట్లాడుతూ.. పకోడాలు అమ్ముకోవడం కూడా ఒక ఉద్యోగం లాంటిదే అంటూ వ్యాఖ్యానించారు. దీంతో ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ మోదీ వ్యాఖ్యలను ఎద్దేవా చేస్తూ పకోడాలు వేసి నిరసన తెలిపింది. ఈ నేపథ్యంలో తాజాగా పంజాబ్ లోని లూథియానా పట్టణంలో ఉన్న ఓ పకోడా షాపుపై ఏకంగా ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. అసలు ఆ షాపు యజమాని ఎంత సంపాదిస్తున్నాడో అంచనా వేసేందుకు ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించారు.

లూథియానాలోని గిల్ రోడ్డులో ఉన్న  ‘పన్నా సింగ్ పకోరే వాలా’ షాపులో పకోడాతో పాటు ఇతర ఆహార పదార్థాలు అమ్ముతున్నారు. ఈ షాపును 1952లో పన్నా సింగ్ కుటుంబం ప్రారంభించింది. చాలామంది రాజకీయ నాయకులు, పోలీసులు, ఇతర ఉన్నతాధికారులు ఈ షాపుకు రెగ్యులర్ కస్టమర్లుగా మారిపోయారు. ఈ నేపథ్యంలో షాపు యజమాని తన ఆదాయాన్ని తక్కువ చేసి చూపినట్లు ఐటీ అధికారులకు పక్కా సమాచారం అందింది. దీంతో ఐటీ శాఖ ఉన్నతాధికారులు దాడులు నిర్వహించారు. ఇందులో భాగంగా గిల్ రోడ్డుతో పాటు మిల్లర్ గంజ్ ప్రాంతంలో ఉన్న పన్నా సింగ్ షాపుల్లో తనిఖీలు చేపట్టారు. కాగా, ఈ విషయంపై స్పందించేందుకు ఇటు పన్నా సింగ్ కుటుంబీకులు కానీ, అటు ఐటీ అధికారులు కానీ నిరాకరించారు.

More Telugu News