Andhra Pradesh: హోంమంత్రి చినరాజప్ప మరదలు కుక్కను ఉసిగొల్పి.. దళిత యువకుడి మరణానికి కారణమైంది!: బీఎస్పీ నేత ఆరోపణ

  • వారం రోజులైనా పోలీసులు చర్యలు తీసుకోలేదు
  • అండగా ఉన్నందుకు మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు
  • రెండ్రోజుల్లో చర్యలు తీసుకోకుంటే రాష్ట్రవ్యాప్త ఆందోళన

ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప మరదలు పెంపుడు కుక్కను ఉసిగొల్పి ఓ దళిత యువకుడిని చంపిందని ఏపీ బీఎస్పీ చీఫ్ పట్టపు రవి ఆరోపించారు. అలాంటి వ్యక్తిని అరెస్ట్ చేయకుండా బాధిత కుటుంబానికి అండగా నిలుస్తున్న బీఎస్పీ నేతలపై పోలీసులు కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో అధికారుల వ్యవహారశైలిపై రవి నిప్పులు చెరిగారు.

గత ఆగస్టు 28న దళిత విద్యార్థి ఎన్.వరుణ్ స్నేహితులతో కలిసి ఆడుకునేందుకు అమలాపురంలోని హౌసింగ్ కాలనీకి వెళ్లాడని పట్టపు రవి తెలిపారు. ఆ సమయంలో చినరాజప్ప మరదలు పెంపుడు కుక్కను వరుణ్ పైకి ఉసిగొల్పిందన్నారు. దాని నుంచి తప్పించుకునే క్రమంలో వరుణ్ పక్కనే ఉన్న ఎర్రకాలువలోకి పడిపోయాడనీ, దీంతో ప్రాణాలు కోల్పోయాడని వెల్లడించారు. ఈ ఘటన జరిగి వారం రోజులు అయినా ఇప్పటివరకూ నిందితురాలిపై పోలీసులు కేసులు నమోదు చేయలేదన్నారు. చినరాజప్ప మరదలిని రెండ్రోజుల్లోగా అరెస్ట్ చేయని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు.

More Telugu News