India: సీ ఓటర్ అండ్ రిపబ్లిక్ సర్వే: తగ్గుతున్న బీజేపీ సీట్లు.. అయినా ఎన్డీయేకే అధికారం... రాష్ట్రాల వారీగా సీట్ల వివరాలు!

  • మహాకూటమి కారణంగా బీజేపీ ఓట్లకు గండి
  • 282 నుంచి 240 స్థానాలకు పడిపోనున్న బీజేపీ
  • 282 స్థానాలకు పరిమితం కానున్న ఎన్డీయే
  • ఆ మేరకు బలం పెంచుకోనున్న యూపీఏ
  • అయినా అధికారానికి దూరమే

మహాకూటమి కారణంగా బీజేపీ ఓట్లకు గండి పడనుందని, 2019లో జరిగే లోక్ సభ ఎన్నికల్లో ఆ పార్టీ ఒంటరిగా అధికారాన్ని పొందే అవకాశాలు లేవని రిపబ్లిక్ టీవీ, సీ-ఓటర్ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ఇదే సమయంలో కాంగ్రెస్ గత ఎన్నికలతో పోలిస్తే బలం పుంజుకున్నా, అధికారానికి చాలా దూరంలోనే ఉంటుందని తెలిపింది. మొత్తం 543 లోక్ సభ స్థానాలకుగాను ఎన్డీయేకు 276, యూపీఏకు 112 సీట్లు వస్తాయని, ఇతరులకు 155 స్థానాలు దక్కుతాయని తమ సర్వేలో తేలినట్టు సీ-ఓటర్ పేర్కొంది. గత ఎన్నికల్లో 282 సీట్లను గెలిచిన బీజేపీ, ఈ దఫా 230 నుంచి 240 స్థానాలకు పరిమితం అవుతుందని, ఆ పార్టీ నేతృత్వంలోని ఎన్డీయే 2014లో 335 స్థానాలను గెలుచుకోగా, ఇప్పుడు 282 స్థానాలకు పరిమితం కానుందని అంచనా వేసింది.

ముఖ్యంగా గత ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడానికి ఎంతో సహకారాన్ని అందించిన యూపీలో ఈ దఫా ఆ పార్టీకి ఎదురుగాలి తప్పదని, 80 సీట్లున్న యూపీలో 2014లో 71 సీట్లను బీజేపీ గెలుచుకోగా, ఇప్పుడు 36 చోట్ల మాత్రమే గెలిచే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. కాంగ్రెస్ లేకుండా సమాజ్ వాదీ, బీఎస్పీ కూటమికి 42 సీట్లు దక్కవచ్చని, కాంగ్రెస్ కు దక్కేది 3 స్థానాలు మాత్రమేనని అంచనా వేసింది.

రాజస్థాన్ లో గత ఎన్నికల్లో మొత్తం 25 సీట్లను గెలుచుకున్న బీజేపీ, ఈ దఫా 17 స్థానాలకు పరిమితం అవుతుందని, మధ్యప్రదేశ్ లోని 29 సీట్లలో గత ఎన్నికల్లో 27 సీట్లను గెలుచుకున్న బీజేపీ ఈ దఫా 23 చోట్ల విజయం సాధించవచ్చని తెలిపింది. రాజస్థాన్ లో కాంగ్రెస్ బలం సున్నా నుంచి 7 స్థానాలకు, మధ్యప్రదేశ్ లో 2 నుంచి 6 స్థానాలకు కాంగ్రెస్ బలం పెరుగుతుందని పేర్కొంది.

బీహార్ లో అధికారంలోని నితీశ్ కుమార్ తో పొత్తు కారణంగా బీజేపీ లాభపడుతుందని, గత ఎన్నికల్లో 22 చోట్ల గెలిచిన బీజేపీ, ఈ దఫా తన బలాన్ని 31కి పెంచుకుంటుందని అంచనా వేసింది. కర్ణాటకలోని 28 స్థానాల్లో కాంగ్రెస్, జేడీఎస్ లు విడివిడిగా పోటీ చేస్తే కాంగ్రెస్ కు 7, జేడీఎస్ కు 3 సీట్లు వస్తాయని, కలసి పోటీ చేస్తే 15 సీట్ల వరకూ గెలుస్తాయని తెలిపింది. పశ్చిమ బెంగాల్ లోని 42 సీట్లలో బీజేపీ 16 సీట్లను గెలుచుకోవచ్చని, 2014లో 34 చోట్ల గెలిచిన తృణమూల్ కాంగ్రెస్, ఈ దఫా 25 స్థానాలకు పరిమితం అవుతుందని అంచనా వేసింది.

ఇక తమిళనాడు విషయానికి వస్తే, గత ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోని డీఎంకేకు, ఈ సారి 28 సీట్లు రావచ్చని, బీజేపీకి 2, అన్నాడీఎంకేకు 9 స్థానాలు దక్కవచ్చని తెలిపింది. 2014 ఎన్నికల్లో గుజరాత్ లోని మొత్తం 26 స్థానాలనూ గెలుచుకున్న బీజేపీ, ఈ దఫా కొన్ని సీట్లను కోల్పోతుందని, చత్తీస్ గఢ్ లో బీజేపీ 11 చోట్ల గెలవవచ్చని తెలిపింది.

బీజేపీకి ప్రతిష్ఠాత్మకమైన మహారాష్ట్రలోని 48 స్థానాల్లో 2014లో 23 చోట్ల గెలిచిన బీజేపీ, ఇప్పుడు ఒక సీటును కోల్పోతుందని అంచనా వేసిన సీ-ఓటర్ సర్వే, ఆ సీటు కాంగ్రెస్ ఖాతాలోకి చేరుతుందని తెలిపింది. ఒడిశాలోని 21 స్థానాల్లో బీజేపీ 12 చోట్ల, బీజేడీ 6 చోట్ల, కాంగ్రెస్ 2 చోట్ల గెలుస్తాయని అంచనా వేసింది. ఈశాన్య రాష్ట్రాల విషయానికి వస్తే, అసోంలో బీజేపీ బలపడుతుందని, కాంగ్రెస్ ఈ మేరకు బలాన్ని కోల్పోతుందని వెల్లడించింది.

More Telugu News