renigunta: రేణిగుంటలో డిక్సన్ ఎలక్ట్రానిక్స్ ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు

  • స్థానికులకు డిక్సన్ పరిశ్రమ ఒక వరం
  • ఏపీకి అన్ని పరిశ్రమలు తీసుకొచ్చేందుకు కృషి 
  • హార్డ్ వేర్ పరిశ్రమకు తిరుపతి కేంద్రంగా మారనుంది

చిత్తూరు జిల్లాలోని రేణిగుంటలో డిక్సన్ ఎలక్ట్రానిక్స్ కంపెనీని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, స్థానికులకు డిక్సన్ పరిశ్రమ ఒక వరమని, ఏపీకి అన్ని పరిశ్రమలు తీసుకురావడం కోసం కృషి చేస్తున్నానని అన్నారు. ఇప్పటికే తిరుపతిలో ఏర్పాటు చేసిన పరిశ్రమల వల్ల ఇరవై వేల ఉద్యోగాలు వచ్చాయని, ఇంకా ఎక్కువ ఉద్యోగాలు తీసుకువచ్చి యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలనేది తన లక్ష్యమని అన్నారు.

హార్డ్ వేర్ పరిశ్రమకు తిరుపతి కేంద్రంగా మారనుందని, వివిధ పెద్ద పరిశ్రమలతో రూ.16 లక్షల కోట్ల విలువైన ఒప్పందాలు కుదుర్చుకున్నామని చెప్పారు. హీరో మోటార్స్ సంస్థ దక్షిణ భారతదేశంలో ఏపీలో మాత్రమే పెట్టుబడులు పెట్టిందని, అనంతపురంలో ఏర్పాటు చేసిన కియా మోటార్స్ కు కేవలం ఆరు నెలల్లోనే మంచి నీటి వసతి కల్పించామని అన్నారు.

తిరుపతిని దేశంలోనే అత్యాధునిక నగరంగా, తయారీ రంగంతో పాటు మెడికల్ హబ్ గా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. అన్ని జాతీయ రహదారులను తిరుపతితో అనుసంధానం చేస్తామని, తిరుపతిలో అనేక సరస్సులు ఉన్నాయని, వీటన్నింటినీ నీటితో నింపితే అద్భుతంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. తిరుపతిని ‘స్పోర్ట్స్ సిటీ’గా కూడా మార్చాలనేది తన కోరిక అని చెప్పారు.

More Telugu News