icici: ఐసీఐసీఐ బ్యాంకు ఎండీ, సీఈవో పదవికి చందాకొచ్చర్ రాజీనామా!

  • వీడియో కాన్ వ్యవహారంతో ఊడిన పదవి
  • అనారోగ్యాన్ని సాకుగా చూపుతూ తప్పుకున్న బ్యాంకర్
  • కొనసాగనున్న సీబీఐ, ఐటీ విచారణ

అనుకున్నదే జరిగింది. వీడియోకాన్ సంస్థకు రూ.3,250 కోట్ల రుణం జారీచేసిన వ్యవహారంలో ఐసీఐసీఐ బ్యాంకు ఎండీ, సీఈవో చందాకొచ్చర్ రాజీనామా సమర్పించారు. ఈ లోన్ కు  ప్రతిఫలంగా కొచ్చర్ భర్త దీపక్ కు వీడియోకాన్ ఓనర్ వేణుగోపాల్ ధూత్ ఆర్థిక లబ్ధి చేకూర్చినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో కొచ్చర్ ను తొలగించాలని ఒక వర్గం, కొనసాగించాలని మరో వర్గం వాదిస్తూ కంపెనీ బోర్డు రెండుగా చీలిపోయింది.  ఈ నేపథ్యంలో కొచ్చర్ రాజీనామాను సమర్పించారు. అనారోగ్యం కారణంగా తాను విధుల నుంచి తప్పుకుంటున్నట్లు ఆమె రాజీనామా లేఖలో పేర్కొన్నారు.

కొచ్చర్ రాజీనామాకు ఆమోదం తెలిపిన ఐసీఐసీఐ బోర్డు సందీప్ భక్షీని కొత్త ఎండీ, సీఈవోగా నియమించింది. భక్షీ ఇప్పటివరకూ తాత్కాలిక సీఈవోగా ఉన్నారు. కాగా, కొచ్చర్ రాజీనామాను ఈరోజు రెగ్యులేటరీ ఫైలింగ్ ద్వారా బీఎస్ఈకి తెలియజేశారు. కొత్త ఎండీ, సీఈవో సందీప్ భక్షీ ఈ పదవిలో 2023, అక్టోబర్ 2 వరకూ కొనసాగనున్నారు. వీడియోకాన్ రుణంపై వివాదం తలెత్తగా తొలుత స్పందించని బోర్డు, ఆ తర్వాత కొచ్చర్ ను సెలవుపై పంపింది.

ఈ ఘటనకు సంబంధించి నమోదైన కేసును ప్రస్తుతం సీబీఐ, ఆదాయపు పన్నుశాఖ అధికారులు విచారణ జరుపుతున్నారు. దీనికితోడు ఈ ఘటనపై కంపెనీ బోర్డు ఇప్పటికే స్వతంత్ర విచారణకు ఆదేశించింది. కాగా, చందాకొచ్చర్ రాజీనామా కంపెనీ షేర్లపై ఎలాంటి ప్రభావం చూపలేదు. మధ్యాహ్నం 2.20 గంటల నాటికి బీఎస్ఈలో ఐసీఐసీసీ బ్యాంకు షేర్లు 4.7 శాతం, ఎన్ఎస్ఈలో 4 శాతం లాభంతో ట్రేడ్ అవుతున్నాయి.

More Telugu News