dr ramineni award: 2018కి గానూ అవార్డులను ప్రకటించిన రామినేని ఫౌండేషన్!

  • బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ కు గౌరవం
  • దర్శకుడు నాగ్ అశ్విన్, రచయిత వెంకటరమణకు చోటు
  • 12న మంగళగిరిలో అవార్డు ప్రదానోత్సవం

ఈ ఏడాదికి గానూ డా.రామినేని ఫౌండేషన్ అవార్డులను ప్రకటించింది. ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ 2018 సంవత్సరానికి డా.రామినేని ఫౌండేషన్ విశిష్ట పురస్కారాన్ని అందుకోనున్నారు. అలాగే  సహస్రావధాని డా.గరికపాటి నరసింహారావు, సినీ దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ రెడ్డి, బాలసాహిత్య రచయిత చొక్కాపు వెంకటరమణ విశేష పురస్కారం అందుకుంటారు.

ఈ వివరాలను డా.రామినేని ఫౌండేషన్ చైర్మన్ ధర్మప్రచారక్, కన్వీనర్ పాతూరి నాగభూషణం ఈ రోజు ప్రకటించారు. ఈ నెల 12న గుంటూరు జిల్లా మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ లో అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం జరుగుతుందని చైర్మన్ ధర్మప్రచారక్ తెలిపారు. మంగళగిరిలో జరిగే ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు, లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ లు ముఖ్య అతిథులుగా హాజరవుతారని వెల్లడించారు.

గతేడాది సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషనర్‌ కేవీ చౌదరి,  ప్రొ.గీతా కె. వేముగంటి, సినీ నటుడు ఆర్‌.నారాయణమూర్తిలను ఈ అవార్డు వరించింది. వీరితో పాటు సురభి కళాకారుడు ఆర్‌.నాగేశ్వరరావు కూడా రామినేని పురస్కారానికి ఎంపికయ్యారు. వివిధ రంగాల్లో నిష్ణాతులైన, విశేష కృషి చేసిన వ్యక్తులకు రామినేని ఫౌండేషన్ ఏటా అవార్డులను అందజేస్తోంది.

More Telugu News